Tuesday 14th of May 2024

సింహగిరిపై 17 నుంచి ధనుర్మాసోత్సవాలు

13 Dec , 2023 12:06 , IST
Article Image

సింహాచలం: సింహగిరిపై ఈ నెల 17 నుంచి ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి మంగళవారం తెలిపారు. అలాగే సింహగిరిపై ఈ నెలతో పాటు వచ్చే జనవరిలో జరిగే పలు విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నెల 17న ధనుర్మాస పూజలు ప్రారంభమవుతాయని, ఆ రోజు తెల్లవారుజామున సింహగిరిపై రాజగోపురంలో నెలగంట మోగించనున్నట్టు పేర్కొన్నారు. అప్పన్న స్వామికి, గోదాదేవికి విశేష పూజలు, తిరువీధి నిర్వహిస్తామన్నారు.● ఆలయంలో ఈ నెల 13 నుంచి 22 వరకు పగల్‌పత్తు ఉత్సవాలు జరుగుతాయన్నారు. రోజూ ఉదయం స్వామివారికి తిరువీధి ఉత్సవం జరుపుతామని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్జిత సేవలను రద్దు చేశామన్నారు.● ఈ నెల 23 నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆలయంలో రాపత్తు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. రోజూ సాయంత్రం 5 గంటలకు స్వామికి తిరువీధి ఉంటుందని, ఈ ఉత్సవాలు సందర్భంగా రాత్రి 7 గంటల వరకే భక్తులకు దర్శనాలు లభించనున్నట్టు పేర్కొన్నారు.● వచ్చేనెల 11 నుంచి 15వ తేదీ వరకు రోజూ ఉదయం సింహగిరిపై గంగధార వద్ద స్వామికి ధారోత్సావాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. .