Sunday 28th of April 2024

సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐకు కన్నీటి వీడ్కోలు

19 Dec , 2023 02:54 , IST
Article Image

మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన కోవెలకుంట్ల మండలం వెలగటూరు గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ గొంగటి సుధాకర్‌రెడ్డికి సోమవారం గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ఏఎస్‌ఐ వీరమరణం పొందగా సోమవారం మధ్యాహ్నం పార్థీవదేహాన్ని సీఆర్‌పీఎఫ్‌ డీఐజీ శివశంకర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనం ద్వారా స్వగ్రామానికి చేర్చారు. జవాను మృతదేహానికి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, డోన్‌ ఆర్డీఓ వెంకటరెడ్డి, ఆళ్లగడ్డ డీఎస్పీ వెంకట్రామయ్య, కోవెలకుంట్ల సీఐ రామానుజులు, ఎస్‌ఐలు వెంకటరెడ్డి, మౌలానీ, గ్రామ సర్పంచ్‌ ఎల్వీ సుధాకర్‌రెడ్డి, సీఆర్‌పీఎఫ్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వర్‌ ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియలకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో గ్రామాన్ని చేరుకోవడంతో వెలగటూరు శోకసంద్రంగా మారింది. భార్య నాగలక్ష్మి, కుమారులు సూర్యచైతన్యరెడ్డి, జయగణేష్‌రెడ్డిలను పలువురు ఓదార్చారు. అనంతరం శాంతిరథంలో సుధాకర్‌రెడ్డి అంతిమ యాత్ర కొనసాగింది. గ్రామ శివారులోని ఆయన సొంత పొలంలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు దేశ సేవకు అంకితమై సుధాకర్‌రెడ్డి చివరకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించారన్నారు. ఆ కుటుంబానికి తాము ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌ను వర్తింపజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే కాటసాని, పోలీసు ఉన్నతాధికారులు.