Tuesday 14th of May 2024

తుపాను నష్టం లెక్కింపు

13 Dec , 2023 12:13 , IST
Article Image

సాక్షి, భీమవరం: మిచాంగ్‌ విపత్తుతో దెబ్బతిన్న రైతులను ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమాతో గట్టెక్కించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. పక్కాగా లెక్క తేల్చేందుకు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీలు క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాయి. పొలాల్లోకి వెళ్లి పంట నష్టం లెక్కిస్తున్నాయి. ఫీల్డ్‌ సర్వే, పబ్లికేషన్‌, సోషల్‌ ఆడిట్‌ అనంతరం 26న తుది జాబితా కలెక్టర్‌ కార్యాలయానికి చేరనుంది. తొలకరి చివరి దశలో ఈ నెల మొదటి వారంలో వచ్చిన తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 3 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో రికార్డుస్థాయిలో జిల్లాలో 258 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీర్రప్రాంత సమీప నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, ఆకివీడి తదితర మండలాల్లో సుడిగాలులు చుట్టేశాయి. జిల్లాలో ప్రధానమైన యనమదుర్రు, నక్కల డ్రైన్‌లు, ఎర్రకాలువలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో రోజుల తరబడి వేలాది ఎకరాల్లోని ముంపునీరు లాగడం కష్టమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ముందుగానే అప్రమత్తమైన అధికారయంత్రాంగం వర్షాలకు ముందే ఆఫ్‌లైన్‌లో కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు చేర్చారు. పొలాల్లో ముంపునీరు లాగేందుకు జేసీబీలు, ఉపాధి కూలీలతో యుద్ధ ప్రాతిపదికన పలు డ్రెయిన్లు, పంట బోదెల్లో పూడిక తొలగించారు. జిల్లాలో 2.13 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగుచేయగా వర్షాలకు ముందే దాదాపు 95 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తయ్యాయి. మిగిలిన మేర 30,092 ఎకరాల్లో పంట నీట మునిగిపోగా, 47,247 ఎకరాల్లో నేలనంటినట్టు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తూ ప్రభుత్వానికి నివేదించింది. ఉద్యానశాఖ లెక్కలు ప్రకారం పాలకొల్లు, ఆచంట, నరసాపురం, పెనుగొండ, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లోని 300 ఎకరాల్లోని కూరగాయల పంటలు, 63 ఎకరాల్లోని అరటి తోటలు, 260 ఎకరాల్లోని కొబ్బరిచెట్లకు, ఐదు ఎకరాల్లోని పూలతోటలకు నష్టం వాటిల్లింది.తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా జిల్లాలో పంటనష్టం లెక్కిం చేందుకు చర్యలు చేపట్టాం. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. వీరంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పారదర్శకంగా పంట నష్టం వివరాలను నమోదు చేస్తారు. సర్వే, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం. "గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో కమిటీలు". "18వ తేదీ వరకు లెక్కింపు.. 22న ఆర్‌బీకేల వద్ద ప్రచురణ". "26న కలెక్టర్‌ కార్యాలయానికి తుది జాబితా". "ప్రాథమిక అంచనా మేరకు 30,092 ఎకరాల్లో నీట మునక".విపత్తులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ ప్రభుత్వం నెల రోజుల్లోపే హెక్టారుకు రూ.17,000 చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్న విషయం విదితమే. ఒక రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల వరకు సబ్సిడీ సాయం అందుతుంది. 33 శాతం పైబడి వరిపంటకు నష్టం వాటిల్లితే పూర్తి నష్టంగా పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత తుపానుతో నష్టపోయిన రైతులకు సాయం అందించేందుకు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి సర్వేకు ఆదేశాలిచ్చింది. గ్రామ కమిటీలో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, వీఆర్‌ఓ, ఈఓ, ఉద్యానశాఖకు సంబంధించి ఈఓ, వీఆర్‌ఓలతో పాటు విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌ (వీహెచ్‌ఏ) సభ్యులుగా ఉన్నారు. మండల కమిటీలో తహసీల్దార్‌, ఎంపీడీఓ, మండల వ్యవసాయాధికారి, డివిజన్‌ స్థాయిలో ఆర్‌డీఓ. ఏడీఏలు సభ్యులుగా పంట నష్టం లెక్కిస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు, ఉద్యానశాఖ అధికారి ఎ.దుర్గేష్‌లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే నిర్వహణను పరిశీలిస్తున్నారు. ఈనెల 18వ తేదీ వరకు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో పక్కాగా లెక్కించనున్నారు. పారదర్శకత కోసం గ్రామ కమిటీలు ఇచ్చిన నివేదికను మండల స్థాయిలోను, మండల కమిటీలు ఇచ్చిన నివేదికను డివిజన్‌లోను పరిశీలిస్తారు. 22 నాటికి రైతులందరికి తెలిసేలా ఆర్‌బీకేల వద్ద నష్టం వివరాలు ప్రచురిస్తారు. రైతుల నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తే వివరాలు నమోదు చేసుకుంటారు. తుది నివేదికను 26వ తేదీన కలెక్టర్‌ కార్యాలయంలో అందజేస్తారు..