Tuesday 14th of May 2024

రైతులకు అండగా ప్రభుత్వం

13 Dec , 2023 12:33 , IST
Article Image

● పంట నష్ట నమోదుకు సహకరించాలి ● జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి . ప్రత్తిపాడు: మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి చెప్పారు. వట్టిచెరుకూరు మండలంలో ప్రారంభమైన పంటల ఎన్యూమరేషన్‌ ప్రక్రియను మంగళవారం జేసీ రాజకుమారి వ్యవసాయ, ఉద్యానశాఖ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత అనంతవరప్పాడు, లేమల్లెపాడు, కాట్రపాడులో మిర్చి, వట్టిచెరుకూరులో వరి పొలాలతోపాటు కారంపూడిపాడులో తడిసిన ధాన్యాన్ని జేసీ పరిశీలించి రైతులతో మాట్లాడారు. పూర్తిగా నష్టపోయామని పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్‌ తమను ఆగమాగం చేసిందని రైతులు జేసీ ఎదుట వాపోయారు. స్పందించిన జేసీ పంటలు నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు. భారీ వర్షాలు వచ్చిన సమయాల్లో పొలాల్లోని నీరు త్వరగా బయటకు వెళ్లేలా డ్రెయిన్లలో పూడికతీసి అడ్డంకులు తొలగించాలని జేసీకి విన్నవించారు.ఈ సందర్భంగా జేసీ రాజకుమారి మాట్లాడుతూ మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన పంటల ఎన్యూమరేషన్‌ మంగళవారం నుంచి ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్‌ 18 వరకు జరుగుతుందని, పంట నష్టం అంచనాల వివరాలను డిసెంబర్‌ 18వ తేదీ నుంచి 22 వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తీసుకువస్తే మరోసారి పరిశీలించి, తుది జాబితాలను డిసెంబర్‌ 26న ప్రభుత్వానికి సమర్పిస్తామని పేర్కొన్నారు.గ్రామ స్థాయిలో రైతుభరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ సెక్రటరీ క్షేత్ర స్థాయిలో పొలాలను పరిశీలించి వివరాలను నమోదు చేస్తారని జేసీ రాజకుమారి తెలిపారు. ఎన్యూమరేషన్‌ అధికారులు పొలాల వద్దకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి వివరాలు తెలియజేసి సహకరించాలన్నారు. నష్టం జరిగిన ప్రతి పొలాన్నీ ఎన్యూమరేషన్‌ అధికారులు స్వయంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నమోదు చేస్తారని స్పష్టం చేశారు. ఆలస్యంగా పొలాలు సాగు చేసిన వివరాలను ఈ–క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేయటానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, ఈ–క్రాప్‌లో పంట నమోదు చేయించుకోని రైతులు వెంటనే వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేయించుకోవాలని కోరారు. ఎన్యూమరేషన్‌ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కల్లాల్లో తడిచిన ధాన్యం శాంపిల్స్‌ తీసుకొని, నష్టం పై పూర్తి నివేదికను అందించాలన్నారు. జేసీ వెంట గుంటూరు ఆర్డీవో శ్రీకర్‌, జిల్లా వ్యవసాయశాఖాధికారి నున్న వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ డెప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు జి.లక్ష్మి, ఏడీఏ శ్రీనివాసరావు, హార్టికల్చర్‌ సైంటిస్టు డాక్టర్‌ గిరిధరరావు, డీసీఎంఎస్‌ మేనేజర్‌ హరిగోపాల్‌, తహసీల్దార్‌ నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. .