Tuesday 14th of May 2024

అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

13 Dec , 2023 01:57 , IST
Article Image

కడప కల్చరల్‌ : రాష్ట్రంలోని దేవాలయాలలోని అర్చకులు, బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వంద శాతం కట్టుబడి ఉందని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా దేవదాయ శాఖ పర్యవేక్షణలో కడప నగరంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో నిర్వహించిన అర్చక పురోహిత ఆత్మీయ సమ్మేళనానికి దేవదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 40 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని అర్చక పురోహితుల సంక్షేమానికి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల్లో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించి, మరో నలుగురికి రాష్ట్రస్థాయి సలహాదారుల పదవులు ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేశారు. జిల్లాలో బ్రాహ్మణ అర్చకులకు ఎంతో మెరుగైన సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయన్నారు. జిల్లాలో వేంపల్లి గండి క్షేత్రం, వెల్లాల ఆంజనేయస్వామి క్షేత్రంతోపాటు పొలతల క్షేత్రం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా మాట్లాడుతూ అర్చకులకు గతంలో కేవలం 5000 రూపాయల భృతి ఇచ్చే వారని, జగన్‌ ప్రభుత్వం దాన్ని రూ. 15 వేలకు పెంచి అర్చకుల జీవితాలను మెరుగుపరిచిందన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఇప్పటికే 36 నూతన దేవాలయాలు వచ్చాయని, మరికొన్ని రానున్నాయని తెలిపారు. రూ. 12 కోట్ల రూపాయలతో పొలతల క్షేత్రం అభివృద్ధి జరుగుతోందని, సంగమేశ్వర ఆలయంలో కళ్యాణ మండపం అదేబాటలో ఉందన్నారు. జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ, అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు విజయ్‌ భట్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అర్చకులకు అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలను అందిపుచ్చుకోవాలని కోరారు..