Tuesday 14th of May 2024

అంతకు మించి..!

13 Dec , 2023 03:43 , IST
Article Image

ఈ ఆర్ధిక సంవత్సరం జిల్లాలోని పట్టణాల పరిధి(అర్బన్‌ లోకల్‌ బాడీస్‌–యూఎల్‌బీ) స్వయం సహాయక సంఘాలకు అందించే బ్యాంక్‌ లింకేజీ రుణలక్ష్యం పూర్తయింది. అంతేకాదు.. లక్ష్యానికి మించి అదనంగా సంఘాలకు రుణాలు అందించడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం 807 సంఘాలకు రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా, మూడు నెలల గడువు ఉండగానే పంపిణీ పూర్తిచేశారు. నగదు లక్ష్యం రూ.75.44 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 95.79 కోట్లు పంపిణీ చేయగా, ఇంకా అర్హత కలిగిన సంఘాలు ఉంటే రుణాలు అందిస్తామని మెప్మా అధికారులు చెబుతున్నారు.మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. సంఘాల్లో సభ్యులకు ప్రభుత్వం బ్యాంక్‌ లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తుండగా, వ్యాపారాలు నిర్వహించి ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే రుణాలు తిరిగి చెల్లించాలి. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రుణ లక్ష్యాలను నిర్దేశిస్తోంది. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలతో మహిళలు సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో ఆర్థికంగా ఎదగడమే కాక కుటుంబ పోషణలో పాలుపంచుకుంటున్నారు.ఈ ఏడాది జిల్లాలోని ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లో 807 సంఘాలకు రూ.75,44,51,000 రు ణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే, ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడు నెలల సమ యం ఉండగానే 828 సంఘాలకు రూ.95,79,02,000 మేర రుణాలు అందజేశారు. లక్ష్యానికంటే ఎక్కువగా 21సంఘాలకు అందజేయడం విశేషం.ఖమ్మం, వైరాల్లో లక్ష్యానికి మించి ఎక్కువగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. సత్తుపల్లిలో 96సంఘాలను లక్ష్యంగా ఎంచుకోగా, అంతే సంఖ్యలో సంఘాలకు రుణాల పంపిణీ పూర్తయింది. ఇక మధిర మున్సిపాలిటీ పరిధిలో మాత్రం లక్ష్యానికంటే తక్కువ సంఘాలకు పంపిణీ చేసినా నగదు మాత్రం ఎక్కువగా అందింది. ఈ మున్సిపాలిటీ పరిధిలో 116 సంఘాలకు రూ.6,13,46,000 పంపిణీ చేయాల్సి ఉండగా, 107 సంఘాలకు రూ.11,07,25,000 అందజేశారు. .