Tuesday 14th of May 2024

రేషన్‌ కార్డుల నిరీక్షణకు తెర?

13 Dec , 2023 04:11 , IST
Article Image

భువనగిరి: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త రేషన్‌ కార్డుల జారీపై లబ్ధిదారులు ఆశలు పెంచుకున్నారు. తాజాగా మంగళవారం రేషన్‌ కార్డులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించి, ఈ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో దరఖాస్తు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పటి రేషన్‌కార్డులను రద్దు చేసి కొత్తగా దరఖాస్తులను స్వీకరించింది. రేషన్‌ తెచ్చుకోవడానికి 2021లో కార్డులను మంజూరు చేసింది కానీ గుర్తింపు కార్డులు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రాన్ని రేషన్‌ షాపుకు తీసుకెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో దరఖాస్తులు చేసుకున్న అర్హులకు ఒక్కసారి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు చేయడం.. అనంతరం ఇప్పటి వరకు నూతన కార్డుల జారీ ప్రక్రియ జరగకపోవడంతో నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.జిల్లాలో మొత్తం 2,16,942 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 2,03,204 ఆహార భద్రత కార్డులు, 13,738 అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉండగా మొత్తం యూనిట్లు 6,60,890 ఉన్నాయి. కాగా.. రేషన్‌ షాపుల ద్వారా బియ్యం తప్ప మరి ఏ ఇతర సరుకులు ఇవ్వడం లేదు. 2014 వరకు రేషన్‌ కార్డుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు కార్డులను మంజూరు చేసింది. అనంతరం 2021లో ఒక సారి దరఖాస్తులు చేసుకున్న వారికి మాత్రమే కొత్తగా కార్డులను మంజూరు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కార్డులను పట్టించుకోలేదు. కాగా జిల్లాలో సుమారు 7వేల నుంచి 9వేల వరకు రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు.దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు కాకపోవడంతో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలను కోల్పోయారు. అలాగే ఎన్నికలకు ముందు తెరపైకి తెచ్చిన గృహలక్ష్మి పథకం కింద ఇళ్ల కోసం, బీసీ బంధు కింద ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోలేకపోయారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఇటీవల ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యసాయం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచింది. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి కార్డులు మంజూరు అవుతాయని భావించారు. దీనికి తోడు మంగళవారం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రేషన్‌ కార్డులపై సమీక్షించి త్వరలో ప్రకటన చేస్తామని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్న వారిలో ఆశలు మరింత పెరిగాయి..