Tuesday 14th of May 2024

పశువుల మందపై

13 Dec , 2023 04:23 , IST
Article Image

● ఆవును హతమార్చిన బెబ్బులి ● అడ్డుకున్న కాపరిపైనా పంజా ● తృటిలో ప్రాణాలతో బయటపడిన వైనం ● కాగజ్‌నగర్‌ మండలం అంకుసాపూర్‌ అటవీప్రాంతంలో ఘటన కొద్దిరోజులుగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో బెబ్బులి మరోసారి అలజడి రేపింది. పశువుల మందపై దాడి చేసి ఓ ఆవును హతమార్చడంతోపాటు కాపరిని తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటన అటవీ పరిసర ప్రాంత ప్రజలను ఒక్కసారి కలవరపాటుకు గురిచేసింది. బాధితులు, అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్‌నగర్‌ మండలం వంజీరి గ్రామానికి చెందిన 42 ఏళ్ల అల్లూరి గులాబ్‌దాస్‌ పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం పశువుల మందను మేత కోసం సమీపంలోని అంకుసాపూర్‌ అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. పశువులు మేత మేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెద్దపులి ఒక్కసారిగా మందపై దాడి చేసింది. ఓ ఆవును హతమార్చింది. గమనించిన పశువుల కాపరి గులాబ్‌ అడ్డుకునే ప్రయత్నం చేయగా పులి అతడిపైనా పంజా విసిరింది. గులాబ్‌ గట్టిగా కేకలు వేయడంతో పెద్దపులి అడవిలోకి ఆవు కళేబరాన్ని లాక్కొని వెళ్లిపోయింది. పులి దాడిలో కాపరి శరీరంపై, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాధితుడిని కాగజ్‌నగర్‌ పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అటవీశాఖ డివిజనల్‌ అధికారి వేణుబాబు, కాగజ్‌నగర్‌ రేంజ్‌ అధికారి వేణుగోపాల్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ పోశెట్టి, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ రమాదేవి, బీట్‌ ఆఫీసర్‌ శ్రీకాంత్‌ ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించారు. పులి దాడి వివరాలు తెలుసుకున్నారు. పులిదాడి నేపథ్యంలో వంజీరి చెక్‌పోస్టు వద్ద అధికారులు బందోబస్తు చేపట్టారు. ప్రయాణికులు కాగజ్‌నగర్‌ నుంచి వాంకిడి వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అటవీ సమీప ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అంకుసాపూర్‌ అటవీ ప్రాంతంలోని భీమదేవర జెండాల సమీపంలోకి పశువులను మేత కోసం తీసుకెళ్లిన. ఒక్కసారిగా పశువుల మందపై పెద్దపులి దాడి చేసింది. ఓ పశువుపై దాడి చేస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేశా. పులి నాపైనా పంజా విసిరి గాయపర్చింది. గట్టిగా అరవడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది.అటవీ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అడ ప్రాజెక్టు కాలువ పరీవాహక ప్రాంతాల్లో పులుల సంచారం ఉంది. మంగళవారం గులాబ్‌పై పంజా విసిరిన దానిని స్థానిక పులిగానే భావిస్తున్నాం. నార్లాపూర్‌, నందిగూడ, అంకుసాపూర్‌, చారిగాం, దరిగాం, కోసిని, కొలంగూడ, వేంపల్లి, మాలిని, మానిక్‌పటార్‌, ఆరెగూడెం, చుంచుపల్లి, ఇటికల్‌పహాడ్‌ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చీపురు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లొ ద్దు. ప్రజలు పత్తి ఏరే క్రమంలో గుంపులు గుంపులుగా ఉండాలి. .