Tuesday 14th of May 2024

దారిలో పెట్టేలా..

13 Dec , 2023 04:33 , IST
Article Image

బీఆర్‌ఎస్‌కు కంచుకోటైన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జోరుమీదున్న ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం బ్రేకులు వేసింది.ఎన్నికల ఫలితాలతో గులాబీ శ్రేణుల్లో కాస్త నిరుత్సాహం నెలకొంది. అయితే వరుసగా స్థానిక సంస్థలు, ప్రాదేశిక, మున్సిపల్‌, పార్లమెంట్‌ ఎన్నికలు రానుండడంతో క్యాడర్‌లో జోష్‌ నింపుతూ.. పార్టీని గెలుపుబాట పట్టించేందుకు అధిష్టానం సూచనలతో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యనా యకులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తమ అనుచరులు, నేతలతో కలిసి బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఉద్యమపార్టీగా ఉన్న బీఆర్‌ఎస్‌కు దూరమైన వర్గాలు ఏమిటీ..? వారిని తిరిగి మచ్చిక చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను సిద్ధం చేసుకుని కార్యాచరణకు సన్నద్ధమవుతున్నా రు. మొదటగా ఢీలాపడిన కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆరుగ్యారంటీల అమలులో విఫలమైతే ప్రజల మద్దతుతో పోరాడేందుకు శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 13స్థానాల్లో 8 సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంది. బీఆర్‌ఎస్‌ ఐదుస్థానాలకు పరిమితం అయ్యింది. మెజార్టీ స్థానాలు గెలుచుకోలేకపోయినా.. గట్టిపోటీ ఇచ్చామని, గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీయే విజయం సాధించిందని నేతలు చెబుతున్నారు. పార్టీ ఓడినా క్యాడర్‌ బలంగా ఉందంటూ నేతలను ఎన్నికల సమరానికి సిద్ధం చేయనున్నారు. ఉద్యమపార్టీగా పోరాడిన బీఆర్‌ఎస్‌, సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కాంగ్రెస్‌ పార్టీ విధానాలపై పోరాటం ద్వారానే ప్రజల మద్దతును తిరిగి పొందాలని చూస్తోంది. ఎన్నికలకు సమయం ఎక్కువరోజులు లేకపోవడంతో అందివచ్చిన ప్రతి అంశాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారానే తిరిగి విజయబావుటా ఎగరవేయాలని భావిస్తోంది.ప్రజలు బీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థలు, పార్లమెంట్‌ ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలూ గెలుచుకుంటాం. పార్టీ జిల్లాలో పటిష్టంగా ఉంది. అందరు ప్రజాప్రతినిధులతో చర్చించి ముందుకు వెళ్తాం. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు స్థానాలు తిరిగి గెలుచుకున్నాం. రానున్న ఎన్నికల నాటికి బలోపేతమై పక్కాప్రణాళికతో ముందుకు వెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతాం. .