Tuesday 14th of May 2024

భద్రగిరిలో వైకుంఠ శోభ

13 Dec , 2023 04:37 , IST
Article Image

బుధవారం శ్రీ 13 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023:భద్రగిరిలో ముక్కోటి ఉత్సవ శోభ సంతరించుకుంది. శ్రీ సీతారామచంద్రస్వామి వారు కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రం ఉత్సవాలకు ముస్తాబైంది. రోజుకో అవతారంలో దర్శనభాగ్యం కల్పించే రామచంద్రమూర్తి కోసం ఎదురుచూస్తున్న భక్తుల నిరీక్షణకు ఇక తెరపడనుంది. సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను కొలువుదీర్చేందుకు మిథిలా స్టేడియంలో ప్రత్యేక వేదిక సిద్ధమైంది. రామనామ స్మరణలు, సంకీర్తనలతో శ్రీ రామ దివ్య క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది. రామాలయంలో బుధవారం వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 2 వరకు అధ్యయనోత్సవాలు, 3 నుంచి 5 వరకు విలాసోత్సవాలు జరగనున్నాయి. జనవరి 8న సర్వదేవతా అలంకారమైన విశ్వరూప సేవ నిర్వహించనున్నారు.అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి 22 వరకు పగల్‌ పత్తు ఉత్సవాలు, 23 నుంచి జనవరి 2 వరకు రాపత్తు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం మత్స్యావతారం, 14న కూర్మావతారం, 15న వరాహావతా రం, 16న నరసింహావతారం, 17న వామనావతారం, 18న పరశురామావతారం, 19న శ్రీరామావతారం, 20న బలరామావతారం, 21న శ్రీకృష్ణావతారంలో స్వామివారిని అలంకరిస్తారు. 22న తెప్సోత్సవం, 23న ఉత్తర ద్వార దర్శనం వేడుకలు ఉంటాయి. ఇందుకోసం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజామున ఉత్తరద్వారంలో వేంచేపు చేస్తారు. అక్కడ భక్తులు దర్శించుకున్న తర్వాత ద్వారానికి ఎదురుగా గల మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుదీరుస్తారు. భక్తుల దర్శనాలు, ప్రత్యేక పూజల అనంతరం తిరువీధి సేవ నిర్వహించి తిరిగి గర్భగుడికి తీసుకొస్తారు. కాగా, పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుంచి ఈనెల 23 వరకు బేడా మండపంలో జరిగే నిత్యకల్యాణాలు రద్దు చేశారు.అధ్యయనోత్సవాల సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా స్టేడియం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్థానిక కళాకారులతో పాటు చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌, వరంగల్‌కు చెందిన కళాకారులచే కూచి పూడి, సంగీత, భజన కార్యక్రమాలు, రాత్రి 9.15 గంటల నుంచి 11 గంటల వరకు పర్చూరు నాగాంజనేయ నాట్యమండలి వారిచే ‘శ్రీకృష్ణ రాయ బారం’ నాటక ప్రదర్శన ఉంటాయి. ముక్కోటి అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని రామాలయాన్ని, భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. బ్రిడ్జి సెంటర్‌, అభయాంజనేయస్వామి పార్క్‌, సూపర్‌బజార్‌ సెంటర్‌, మిథిలా స్టేడియం వద్ద ఇప్పటికే స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. రామాలయం, మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాల్లో షామియానాలు, చలువ పందిళ్లు వేశారు. భక్తులకు ఆధ్యాత్మికంగా ఆహ్వానం పలికేందుకు రామాయణ ఇతివృత్తాలను తీర్చిదిద్దుతున్నారు. మిథిలా స్టేడియంలో స్వామివారి వేదికను ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీపాలతో రామాలయం వెలుగొందుతోంది. పట్టణంలో పలుచోట్ల ఉత్సవాల బోర్డులు ఏర్పాటు చేశారు..