Tuesday 14th of May 2024

‘గుర్తింపు’లో పొత్తుల్లేవ్‌ !

13 Dec , 2023 04:40 , IST
Article Image

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో అఽధికార బీఆర్‌ఎస్‌ పార్టీని మట్టి కరిపించిన రాజకీయ పార్టీలు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల దగ్గరికి వచ్చే సరికి పొత్తుల మాట ఎత్తడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ అనుబంధ కార్మిక సంఘం గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 40వేల మంది కార్మికులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) గుర్తింపు సంఘంగా ఉంది. ఆరు జిల్లాల పరిధిలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములను సింగరేణి కార్మికులు ప్రభావితం చేయగలరు. దీంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే విషయంలో అప్పటి అధికార బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. 2021 అక్టోబర్‌ నుంచి 2023 అక్టోబర్‌ వరకు రెండేళ్ల పాటు వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు నామినేషన్ల స్వీకరణ పూర్తయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలను సాకుగా చూపుతూ మరోసారి గుర్తింపు ఎన్నికలు వాయిదా వేశారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ సమీకరణలు కూడా మారాయి. ఆ ఎన్నికలకు మూడు నెలల ముందువరకు బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ ఒక వైపు ఉండగా కాంగ్రెస్‌ పార్టీ మరోవైపు నిలబడింది. కానీ గత ఆగస్టులో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక వైపు ఉండగా కాంగ్రెస్‌, సీపీఐ ఒక జట్టు కట్టాయి. కొంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య సీపీఎం సైతం ఈ రెండు పార్టీలకు అండగానే నిలబడింది. పొత్తులు కుదిరి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు విజయ ఢంకా మోగించాయి. కలిసికట్టుగా విజయయాత్రలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఊహించని పరాజయం బీఆర్‌ఎస్‌ వశమైంది. దీంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో ప్రధాన పార్టీల మధ్య మిత్రధర్మం కొనసాగుతుందా లేక కార్మిక సంఘాల విషయంలో జోక్యం చేసుకోకుండా మిన్నకుంటాయా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.ఈనెల 27న జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి. ఈ మేరకు నామినేషన్లు దాఖలు చేశాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో భూపాలపల్లి, మందమర్రి ఏరియాల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ విజయం సాధించగా, మిగిలిన తొమ్మిది ఏరియాల్లో టీబీజీకేఎస్‌ గెలుపొందింది. అయితే నాలుగేళ్ల పదవీ కాలం ముగిసినా వాయిదా పేరుతో మరో రెండేళ్లు గుర్తింపు సంఘంగా ఉండటంతో టీబీజీకేఎస్‌పై కార్మికుల్లో కొంత వ్యతిరేకత గూడు కట్టుకుంది. దీనికి తోడు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలయింది. దీంతో టీబీజీకేఎస్‌ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొంది. దీన్ని పోగొట్టేందుకు ఆ సంఘానికి చెందిన నాయకులు ఏరియాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ సంఘానికి మద్దతుగా ఉన్న నేతలు, కార్మికుల్లో ధైర్యం నింపుతూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. .