Tuesday 14th of May 2024

తెలంగాణ వరికి.. కర్ణాటకలో డిమాండ్‌

13 Dec , 2023 04:44 , IST
Article Image

గత ప్రభుత్వం అన్నదాతకు మద్దతు ధరను ప్రకటిస్తూ క్వింటాకు రూ. 2200 ప్రకటించింది. గతేడాది సన్నరకం ఆర్‌ఎన్‌ఆర్‌ వరి ధాన్యం ప్రైవేట్‌లో రూ.2,300 దాటింది. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు దొడ్డురకం వరి ధాన్యాన్ని మాత్రమే విక్రయించారు. ఈ ఏడాది వానాకాలం ఆర్‌ఎన్‌ఆర్‌ వరి ధాన్యం (సోనా)కు నారాయణపేట మార్కెట్‌యార్డులో వ్యాపారస్తులు పోటాపోటీగా ధరలను కోడ్‌ చేస్తుండడంతో గరిష్టంగా క్వింటాకు రూ. 3,401 పలికింది. హంస రకం సైతం క్వింటాకు రూ.2,650 నుంచి 3,246 వరకు పలికింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు విముఖత చూపుతున్నారు. జిల్లాలో పండిస్తున్న తెలంగాణ సోనాకు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అధిక డిమాండ్‌ పలుకుతుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. ఇక్కడి సోన, హంస వరి ధాన్యానికి రికార్డు ధరలు పలుకుతున్నాయి. వానాకాలం, యాసంగిలో వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే రైతులు విక్రయించేందుకు మొగ్గుచూపేవారు. ఈ ఏడాది ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యానికి మార్కెట్‌లో ఊహించని విధంగా డిమాండ్‌ వచ్చింది. జిల్లాలోని 13 మండలాలు.. 252 రెవెన్యూ గ్రామాల్లో ఈ ఏడాది వానాకాలం 1.69లక్షల ఎకరాల్లో వరి సాగుచేయడంతో దిగుబడి దాదాపు 40.66లక్షల క్వింటాళ్లు వస్తుందని అధికారులు అంచనా వేశారు.తెలంగాణ సోనా వరి ధాన్యానికి రూ.3 వేల నుంచి రూ. 3,600 దాటుతుంది. దీంతో రైతులు దాదాపు కర్ణాటకకే విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. కర్ణాటకలోని రాయచూర్‌ మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ సోనాకు వ్యాపారస్తులు పోటీపడి ధరలు వేస్తుండడంతో అక్కడే విక్రయించేందుకు రైతులు మొగ్గుచుపుతున్నారు. ముంబాయి, బెంగూళూర్‌, చైన్నె నగరాల నుంచి వ్యాపారస్తుల నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయనే డిమాండ్‌తో ధరలు పెరగుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌లో సోనా వరి ధాన్యానికి వ్యాపారస్తులు పోటీపడి ధరలు కోడ్‌ చేస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వరి ధాన్యమంతా రాయచూర్‌, మిర్యాలగూడ, నిజామాబాద్‌ మిల్లర్లే అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. మార్కెట్‌లో వ్యాపారస్తులు పోటీపడి ఆర్‌ఎన్‌ఆర్‌, హంస రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. యార్డులో రోజు రోజుకు ఆర్‌ఎన్‌ఆర్‌ ధరలు పలుకుతుండడంతో రికార్డు సృష్టిస్తున్నాయి. మార్కెట్‌ చరిత్రలోనే ఈ ధరలు వరి ధాన్యానికి పలకలేదు. మరో వారం రోజుల పాటు ఇలాగే ధరలు కొనసాగే అవకాశం ఉంది. – భారతి, మార్కెట్‌ కార్యదర్శి, నారాయణపేట .