Tuesday 14th of May 2024

ప్రజలతో మమేకమై పని చేయండి

13 Dec , 2023 05:55 , IST
Article Image

సిద్దిపేటరూరల్‌: ప్రజలతో మమేకమై జిల్లా అభివృద్ధికి పని చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో మొదటి సారిగా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన వివరాలను మంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలన ఆలోచన విధానం మారిందని, అధికారులు వారి విధానాలను మార్చుకోవాలని అన్నారు. గతంలో అధికారం కేంద్రీకృతంగా ఉందని, నేడు వికేంద్రీకరణ జరగాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజా సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సీపీ శ్వేతలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, సీపీ శ్వేత, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్‌ అధికారి సరోజా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.హుస్నాబాద్‌ పట్టణంలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హన్మకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి నివాసంలో ఆయనకు కలెక్టర్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు అవుతోందని, ఇందు కోసం 50 ఎకరాల స్థలాన్ని సేకరించాలని తహసీల్దార్‌ను ఆదేశించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మంగళవారం హుస్నాబాద్‌ మున్సిపాలిటీని మంత్రి సందర్శించారు. మంత్రిగా మొదటి సారి రావడంతో పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వచ్చే కేబినెట్‌ సమావేశంలో మెడికల్‌ కళాశాల స్థలం కేటాయింపుపై ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయాన్ని కరీంనగర్‌లో ఏర్పాటు చేశానన్నారు. అలాగే కరీంనగర్‌, సిరిసిల్ల ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశానని, హుస్నాబాద్‌లో కూడా కేంద్రీయ విద్యాలయం కోసం ప్రయత్నిస్తానని, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించామన్నారు..