Tuesday 14th of May 2024

నగరంలో దోమల బెడద

13 Dec , 2023 06:00 , IST
Article Image

నిజామాబాద్‌నాగారం: నగరంలో దోమల బెడద తీవ్రమవుతుంది. ఆయా కాలనీల్లో డ్రెయినేజీలు సరిగా లేకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ రోజుల తరబడి నిలిచిపోతుంది. అలాగే మురుగుకాలువలను మున్సిపల్‌ సిబ్బంది అంతంమమాత్రంగానే శుభ్రం చేస్తున్నారు. దీంతో పరిసరాలు అధ్వానంగా మారడంతోపాటు, దోమలు వృద్ధిచెందుతున్నాయి. దోమలను నివారించడానికి ఫాగింగ్‌ చేయించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. సుమారు 4లక్షల జనాభా ఉంది. ఒక్కో డివిజన్‌లో పదుల సంఖ్యలో కాలనీలున్నాయి. అలాగే చాలా కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. మురుగునీరు సక్రమంగా ప్రవహించడం లేదు. ఎక్కడిక్కడే ఆగిపోతుంది. నగరంలోని చంద్రశేఖర్‌కాలనీ, సాయనగర్‌, గాయత్రినగర్‌, కోటగల్లీ, గౌతంగనర్‌, దుబ్బ, అర్సపల్లి, గాజులపేట్‌, పోచమ్మగల్లీ, వినాయక్‌నగర్‌, కంఠేశ్వర్‌ తదితర ప్రాంతాల్లో దోమల బెడద అధికంగా ఉంది.దోమలను నివారించడానికి నగరంలోని కాలనీల్లో మున్సిపల్‌ సిబ్బంది ఫాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయినా అధికారులు ఫాగింగ్‌ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఫాగింగ్‌ను మాములుగా తీసుకోవడంతో జోన్‌స్థాయి అధికారులు తమకేమీ పట్టన్నట్లు వ్యవహారిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో దోమల విజృంభనతో చాలామంది వ్యాధులకు గురికావడంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు స్పందించి నగరంలో దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. .