Tuesday 14th of May 2024

వడ్లు తీసుకొస్తలేరు!

13 Dec , 2023 06:15 , IST
Article Image

జిల్లాలోని ధాన్యం కొనుగో లు కేంద్రాల్లో మందకొడిగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. మిచాంగ్‌ తుపాను నేపథ్యంలో ముందస్తుగా కోతలు చేపట్టిన రైతులు పొలాల వద్దనే దొడ్డు రకం ధాన్యం అమ్మకాలు చేపడుతున్నారు. అలాగే స న్నరకం ధాన్యానికి బయట మార్కెట్‌లో ఎక్కువ ధర పలుకుతుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో సందడిగా ఉండాల్సిన కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.వానాకాలం సీజన్‌లో 1,59,408 ఎకరాల్లో వరి సాగుచేశారు. 3,50,650 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రైతులు తమ అవసరాలకు పోగా కొనుగోలు కేంద్రాలకు 2.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తీసుకొస్తారని అంచనా. ఇందు కోసం జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఐకేపీ 58, పీఏసీఎస్‌ 142, జీసీసీ 11, మెప్మా 2, డీహెచ్‌ఎస్‌ 3 చొప్పున మొత్తం 216 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో నవంబర్‌ మూడోవారంలోనే 191 సెంటర్లు ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 49 సెంటర్లలోనే కొనుగోళ్లు ప్రారంభించారు. ఇక్కడ కూడా ఒక్కరు ఇద్దరు రైతుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి వస్తోందని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. సన్నరకం ధాన్యం ఎక్కువ ధరతో బహిరంగ మార్కెట్‌ అమ్మకాలు చేపడుతున్నారు. అలాగే దొడ్డు రకాలు పండించిన చాలా మంది రైతులు తేమశాతం, మిల్లర్ల కోతలు, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని తమకు తెలిసిన ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మకాలు చేపడుతున్నారు. దీంతో జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో 20రోజులుగా 846 మంది రైతుల నుంచి రూ. 9,82,69,879 విలువచేసే 4,477 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.ఏటా వానాకాలంలో రైతులు ఎక్కువగా దొడ్డురకం ధాన్యం పండించేవారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు కాసేవారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలామంది రైతులు సన్నరకం ధాన్యం పండించారు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం సన్నరకం పచ్చి ధాన్యం క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,600 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరబోసి, తాలు, దుమ్ములేకుండా ఉన్న సన్నరకం ధాన్యం జై శ్రీరాం, సాంబమసూరి, చిట్లతోపాటు ఆర్‌ఎన్‌ఆర్‌ రకం ధాన్యం క్వింటాకు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు పలుకుతోంది. ఉద్యోగులు, వ్యాపారులు రైతుల వద్ద నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్‌ చేయించుకొని నిల్వ ఉంచుకుంటున్నారు. .