Monday 13th of May 2024

‘మండే’ మహాలక్ష్మి@ 31లక్షలు

13 Dec , 2023 07:13 , IST
Article Image

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గార్యంటీల్లో భాగంగా ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో వాస్తవరద్దీ ఎంత ఉంటుందో అంచనా వేయటం కష్టం. సాధారణ రోజుల్లో కంటే సోమవారాల్లో బస్సుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆరోజు దాదాపు 35 లక్షల మంది వరకు బస్సుల్లో ప్రయాణిస్తారు.సాధారణ రోజుల్లో ఆ సంఖ్య 28 లక్షల మేర ఉంటుంది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజువారీ ఆదాయం రూ.14 లక్షలుంటే, సోమవారాల్లో రూ.18 లక్షల వరకు ఉంటుంది. అలాంటిది 11వ తేదీ సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో ఏకంగా 51 లక్షల మంది ప్రయాణించినట్టు ఆర్టీసీ లెక్క తేల్చింది. ఇందులో టికెట్‌ తీసుకున్న ప్రయాణికుల సంఖ్య 20.87 లక్షలుగా పేర్కొంది. అంటే మిగతావారు మహిళలే అని స్పష్టమవుతోంది. ఒక్కరోజే రూ.7 కోట్లు తగ్గిన ఆదాయం: సోమవారాల్లో రద్దీకి అనుగుణంగా ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. సగటున రూ.18.50 కోట్ల మేర ఆదాయం వస్తుంది. ఈ సోమవారం ప్రయాణికుల సంఖ్య 51 లక్షలు నమోదైనందున ఆదాయం కూడా భారీగానే పెరగాలి. కానీ ఇందులో మహిళల సంఖ్య 60 శాతానికి పైగా ఉన్నందున ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో వారి నుంచి నయా పైసా ఆదాయం రాలేదు. దీంతో ఈ సోమవారం కేవలం రూ.11.74 కోట్ల ఆదాయం మాత్రమే రికార్డయ్యింది. మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమే అయినా, టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తారో ఆ వివరాలతో కండక్టర్‌ జీరో టికెట్‌ జారీ చేస్తారు. టికెట్‌పై చార్జీ స్థానంలో సున్నా అని ఉంటుంది. కానీ, వాస్తవానికి వారి నుంచి ఎంతచార్జీ వసూలు చేయాల్సి ఉందో ఆ టికెట్‌ ద్వారా అధికారులకు తెలుస్తుంది..