Tuesday 14th of May 2024

‘ప్రజావాణి’ అర్జీలకు సత్వర పరిష్కారం

14 Dec , 2023 11:32 , IST
Article Image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణికి ఆరు అర్జీలు వచ్చినట్లు ఏఎస్పీ రామదాసు తేజావత్‌ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులతో వినతులు స్వీకరించారు. భార్యాభర్తల గొడవలకు సంబంధించి 2, భూతగాదాలకు సంబంధించి 2, పరస్పర గొడవలకు సంబంధించి 2 అర్జీలు దాఖలయ్యాయి. పరిష్కారం కోసం సంబంధిత ఠాణాలకు సిఫారస్‌ చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ తేజస్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సుమారు రెండు నెలల తర్వాత సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి అర్జీలు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగిన ప్రజావాణికి 10 అర్జీలు వచ్చినట్లు గ్రీవెన్స్‌ సెల్‌ అధికారి శ్రీకాంత్‌రావు తెలిపారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ ఎస్‌.తిరుపతిరావు ప్రజావాణిలో పాల్గొని అర్జీలు స్వీకరించారు.జీవోనంబర్‌ 98ని అమలు చేసి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్వాసితులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు ప్రారంభమైన ప్రక్రియను యధావిధిగా కొనసాగించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆనంద్‌, సురేష్‌, నిర్వాసితులు ఉన్నారు. .