Tuesday 14th of May 2024

పనులు నిర్దేశించారు.. వేతనాలు మరిచారు

14 Dec , 2023 11:46 , IST
Article Image

అసెంబ్లీ ఎన్నికల్లో నిఘా బృందాల పనితీరును నిరంతరం చిత్రీకరించిన వీడియోగ్రాఫర్‌లకు రోజుకు ఎంత వేతనం అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఎన్నికల తంతు ముగిసి పది రోజులైనా వీడియోగ్రాఫర్‌లకు కూలి చెల్లించడంలో ఎన్నికల అధికారులు తాత్సారం చేస్తున్నారు. రెండు రోజుల కింద రిటర్నింగ్‌ కార్యాలయాలకు రెవెన్యూ ఉన్నతాధికారులు పిలిచి రోజుకు ఒక్కో వీడియోగ్రాఫర్‌కు రూ.60 చొప్పున పని చేసిన రోజులకు అడ్వాన్స్‌ చెల్లించారు. తాము సొంతంగా ఖర్చు చేసుకుని 50 రోజుల పాటు పని చేస్తే ఇంకా ధర నిర్ణయం చేయకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.వీడియో గ్రాఫర్లు తమకు రోజుకు రూ.2వేల చొప్పున కూలీ చెల్లిస్తేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కొందరికి సొంతంగా కెమెరాలు ఉండగా అనేక మంది అద్దె ప్రాతిపదికన కెమెరాలను తీసుకుని వచ్చారు. వీడియో కెమెరాకు రోజుకు అద్దె రూ.600లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నిఘా బృందాల వద్దకు వీడియోగ్రాఫర్‌లు వెళ్లి రా వడానికి సొంతంగా వాహనంలో పెట్రోల్‌ పోయించుకోవాల్సి ఉంది. ఇలా ఒక్కో వీడియోగ్రాఫర్‌ రూ.750 వరకు ఖర్చు చేశారు. 8 గంటల నుంచి 12 గంటల పాటు పని చేస్తే కేవలం రూ.600 మాత్రమే ఇచ్చి ధర ఇంకా నిర్ణయం కాలేదని చెప్పడం ఎంత వరకు సబబు అని వీడియోగ్రాఫర్‌లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కమీషన్‌ జోక్యం చేసుకుని వీడియోగ్రాఫర్‌లకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ఎంత నిధులు వెచ్చించారు, ఎవరికి ఎంత ఖర్చు చేయాల్సి ఉంది అనే అంశంపై ఎన్నికల కమిషన్‌ స్పష్టత ఇస్తేనే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండటానికి ప్రతి నియోజకవర్గంలో మూడు రకాల నిఘా బృందాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి రెండు మండలాలకు ఈ బృందాలు నిఘా ఉంచి మద్యం, డ బ్బుల ప్రవాహంను అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాయి. నిఘా బృందాల పనితీరు పారదర్శకంగా ఉండటానికి వీడియోగ్రాఫర్‌లను నియమించారు. ప్రతి తనిఖీని వీడియో చిత్రీకరించి ఎన్నికల కమిషన్‌కు ఎప్పటికప్పుడు పంపించారు. వీడియోగ్రాఫర్‌లు అందరిని ప్రైవేటుగా నియమించారు. రోజు మూడు షిప్టులలో ముగ్గురు వీడియోగ్రాఫర్‌లు పని చేసేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 20 మంది నుంచి 25 మంది వరకు వీడియోగ్రాఫర్‌లు పని చేశారు..