Tuesday 14th of May 2024

తగ్గేదే లేదు..

14 Dec , 2023 11:54 , IST
Article Image

ఉమ్మడి వరంగల్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరు తగ్గడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కొంతముందుగా, అంటే చివరి రోజుల్లో ప్రభుత్వానికి స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి రూ.120 కోట్ల నుంచి రూ.145 కోట్ల వరకు ఉండేది. గతేడాది నవంబర్‌ నాటికి రూ.394.56 కోట్లకు చేరింది. గ్రేటర్‌ వరంగల్‌ చుట్టూరా కాజీపేట, వరంగల్‌, హనుమకొండ, హసన్‌పర్తి, మడికొండ, మామునూరు, ధర్మసాగర్‌ తదితర ప్రాంతాల్లో విస్తరించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది. వరంగల్‌, జేఎస్‌ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, భూములు క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఒకప్పుడు సగటున నెలకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు అయ్యే రిజిస్ట్రేషన్లు.. ఇప్పుడు 10,365 వరకు దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి.ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 2023లో రిజిస్రేషన్ల జోరు కొనసాగింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి 1,14,211 దస్తావేజుల రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా, ఆ శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.451.58 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా గతేడాది నవంబర్‌ నాటికి 1,10,422 దస్తావేజల రిజిస్ట్రేషన్లకు గాను రూ.394.56 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ఈ ఏడాది నవంబర్‌ 2023 నాటికి గతేడాది కంటే రూ.57.02 కోట్ల అధిక ఆదాయం అందజేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌కు దీటుగా రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకోవడంతో రెండో రాజధానిగా గుర్తింపు పొందిన ఓరుగల్లు నగరం ఖజానాకు ఆదాయం అందించడంలోనూ పోటీ పడుతోంది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే గతేడాది, ఈ ఏడాది కూడా వరంగల్‌ తర్వాత జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులు చెబుతున్నాయి. .