Tuesday 14th of May 2024

తపాలాశాఖలో సమ్మె సైరన్‌

14 Dec , 2023 12:03 , IST
Article Image

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని తపాలా ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. రెండు రోజులుగా విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. తమ డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామీణ ఢాక్‌ సేవకులు పోరుబాటపట్టారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లు అమలు చేసే వరకు పోరు సాగుతుందని స్పష్టం చేశారు. ఏఎస్‌జీడీఎస్‌యూ, ఎన్‌యూజీడీఎస్‌ యూనియన్ల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా పోస్టల్‌ సేవలు నిలిచిపోవడంతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు.జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ఢాక్‌ సేవకులు(తపాలా ఉద్యోగులు) 160 మంది ఉన్నారు. వీరు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహిస్తే తప్ప రోజువారిలో పనిభారం తీరదు. నిబంధనల ప్రకారం 8 గంటలపాటు పనిచేయాలి. కానీ పనిభారం ఎక్కువై రోజులో 14 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తపాలాశాఖలో పోస్టల్‌ సేవలే కాకుండా బ్యాంకింగ్‌ సేవలు విస్తరించాయి. దీంతో గ్రామీణ ఢాక్‌ సేవకులపై పనిభారం పెరిగింది. వీరు గ్రామీణ ప్రజలకు ఇంటింటికెళ్లి వివిధ రకాల ప్రభుత్వ పథకాలు, బీమాలు, డబ్బులు విత్‌డ్రా, పోస్టులు, అంతర్జాతీయ ప్రైవేటు సంస్థల పార్సిల్స్‌ అందిస్తున్నారు.గ్రామీణ ఢాక్‌ సేవకులు గ్రామాల్లో ఉంటూ పోస్టల్‌ బ్యాంకింగ్‌ ఆర్డీ, ఎస్బీ, సుకన్య అకౌంట్లు ప్రజలతో తీయిస్తున్నారు. జీవితబీమాలు, బజాజ్‌, టా టాఏజీ, వివిధ బ్యాంకుల ఇన్సూరెన్సులు, ఆధార్‌ ఆధారిత పేమెంట్లను అందిస్తున్నారు. రైతుబంధు, పీఎంకిసాన్‌, మనీ ఆర్డర్లు, ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన, డబ్బులను నేరుగా ఇంటికి వచ్చి లబ్ధిదారులకు అందిస్తున్నారు. పాన్‌, ఏటీఎం కార్డులు అప్లయ్‌ చేయించడం, పెన్షన్ల కోసం డిజిటల్‌ లైవ్‌ సర్టిఫికెట్లు, వివిధ బ్యాంకుల పేమెంట్లు అందించడం వంటి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక రో జువారి పోస్టులు, ఉత్తరాలు, ప్రత్యుత్తరాల సేవలతోపాటు వివిధ ప్రైవేటు సంస్థల కొరియర్స్‌, పార్సిల్స్‌, బట్వాడా, స్పీడ్‌పోస్టులు, స్పీడ్‌ రిజిస్టర్‌ పోస్టులు సర్వీసులు అందిస్తున్నారు. .