Tuesday 14th of May 2024

కందిపోయిన రైతు

14 Dec , 2023 12:09 , IST
Article Image

ఈ ఏడాది వానాకాలం సీజన్‌ కంది పంట సైతం రైతును తీవ్ర నిరాశ పర్చింది. కంది పంటను నడిగడ్డ రైతులు చాలా ఇష్టంగా సాగు చేస్తారు. కానీ, ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల తీవ్రంగా దెబ్బతిని దిగుబడులు గణనీయంగా తగ్గాయి.జిల్లాలో ఈసారి వానాకాలం సీజన్‌లో కంది పంటను 22,503 ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇందులో వర్షాధారం కింద, నీటి లభ్యత ఉన్న రెండు చోట్ల వేశారు. అయితే జూన్‌లో వర్షాలు ఆశించినంతగా వర్షాలు కురవలేదు. జులైలో పది రోజల పాటు వర్షాలు కురిశాయి. ఆతర్వాత వరుణుడి జాడ లేకుండా పోయింది. వర్షాల మాట అటుంచితే పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. వర్షాకాలం ముగిసిన తర్వాత శీతాకాలంలో సైతం చలి తీవ్రత తక్కువగానే ఉండింది. ఇలా వాతావరణ పరిస్థితులు కంది పంటపై ప్రభావాన్ని చూపాయి. కంది పంట కాలం దాదాపు పూర్తి కావొస్తోంది. కోతలకు రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే పంట దిగుబడులు రైతులకు కనీళ్లు తెప్పిస్తున్నాయి. వర్షాధారం కింద ఎకరాకు 3నుంచి 5 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, కేవలం రెండు నుంచి రెండున్నర క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. నీటి లభ్యత ఉన్న చోట 8నుంచి 10 క్వింటాళ్లు రావాల్సి ఉండగా 5నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలం దాదాపు పూర్తి కావస్తోందని, గింజలను బట్టి పంట దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు అంచనాకు వచ్చామని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, తెగుళ్ల వల్ల పంట బాగా దిబ్బతిందని, ఎప్పుడు కంది పంట బాగానే చేతికి వచ్చేదని, కాని ఈసారి పంట ఆర్థికంగా నష్టాలు కలుగచేసిందని అన్నదాతలు వాపోతున్నారు.మాకు ఉన్న పొలంలో మూడు ఎకరాలు కంది పంట వేశాను. వాతావరణంకు తోడు, తెగుళ్ల వల్ల పంట బాగా దెబ్బతింది. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. పెట్టుబడులు ఏటా పెరుగుతున్నాయి. పంట దిగుబడులు తగ్గుతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం.ఈ సారి వానాకాలం సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు రాలేదు. దీనివల్ల వర్షాధారం కింద వేసిన అన్ని రకాల పంటలపై ప్రభావం పడింది. వర్షాధారం కింద వేసిన కంది పంట దిగుబడులు తగ్గాయి. అయితే బోర్లు, బావుల కింద వేసిన చోట దిగుబడులు బాగానే వస్తాయి..