పాఠశాలలకు వెళ్లకుండా.. వివిధ రకాల పనులు చేస్తున్న 14 ఏళ్లలోపు చిన్నారులను గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం బడికి వెళ్లడం లేదు.. బడికి పంపించేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశాలపై ఆరా తీయనున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో చాలామంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయ పనులు పూర్తయ్యాక బతుకుదెరువు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు మహారాష్ట్ర, పుణె తదితర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో చిన్నారులను సైతం తమ వెంట తీసుకెళ్లడం వల్ల వారి చదువులు మధ్యలోనే ఆగిపోతాయి. ఇందుకోసం వలస వెళ్లే వారి పిల్లలను గుర్తించి స్వచ్చంద సంస్థల సహకారంతో సీజనల్ హాస్టల్స్ ఏర్పాటు చేయించి వారికి అన్నిరకాల వసతులు కల్పించి చదువు కొనసాగేలా చూడాలి. కానీ, వీటిని గత మూడేళ్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. దీంతో వలస వెళ్లిన వారి పిల్లలు చదువులకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. గతంలో ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టల్స్ నిర్వాహకులకు బిల్లులు ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తుంటారు. బొగ్గు, ఇటుక బట్టీలు, ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టేందుకు సమూహంగా వెళ్లే వారి పిల్లలు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి ఉంటే వారి కోసం తాత్కాలికంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించి స్కూల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా వీటిని ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. విద్యార్థులను గుర్తించిన వెంటనే అధికారులు చర్యలు తీసుకొని వర్క్‌సైడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి చిన్నారి చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బడిబయటి పిల్లల సర్వే చేపడుతోంది. ఇందులో భాగంగా గత జనవరిలో ఒకసారి చేపట్టగా.. ప్రస్తుతం రెండోసారి సోమవారం నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు వివరాలు సేకరించనున్నారు. ఫీల్డ్‌స్థాయిలో సీఆర్పీలు (క్లస్టర్ రీసోర్స్‌పర్సన్లు) చిన్నారుల వివరాలను రెండు రకాలుగా 6– 14 ఏళ్లలోపు, 15–19 ఏళ్లలోపు వారిని గుర్తించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ప్రభుత్వం సూచించిన ఫార్మాట్‌లో సేకరించి జాతీయ స్థాయి ప్రబంధక్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. .