Tuesday 14th of May 2024

వీరికి మేలు

14 Dec , 2023 12:17 , IST
Article Image

కొలువుదీరిన నూతన కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుగా మహాలక్ష్మి పథకాన్ని శ్రీకారం చుట్టింది. మహిళలు, విద్యార్థినులంతా ఉచిత బస్సు ప్రయాణాన్ని చేస్తూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈనెల 8న మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కాగా బుధవారం వరకు అధిక సంఖ్యలో మహిళలు, విద్యార్థినులు ప్రయాణించారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 21 మండలాలు ఉండగా 469 గ్రామాలున్నాయి. కాగా జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌లో రెండు ఆర్టీసీ డిపోలున్నాయి. మెదక్‌లో 99బస్సులు ఉండగా నర్సాపూర్‌లో 35 ఉన్నాయి. వీటిలో ఎక్స్‌ప్రెస్‌లు, పల్లెవెలుగుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు వీలు ఉంది. ఈనెల 9 నుంచి 13వతేదీ సాయంత్రం వరకు సుమారు 92 వేల మంది మహిళలు జిల్లావ్యాప్తంగా ఉచిత ప్రయాణించినట్లు సంబంధిత ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జిల్లాలో 469 గ్రామాలు ఉండగా 462 గ్రామాలకు ఈ సౌకర్యం ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఉదయం, సాయంత్రం వేళలో స్కూల్‌ విద్యార్థుల కోసం తిరిగే గ్రామాలు అధికంగా ఉన్నాయి. ఈ పథకం వల్ల ఆడపిల్లల చదువుకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మహాలక్ష్మి పథకం విద్యార్థినులకు ఒక గొప్ప వరంగా మారింది. జిల్లావ్యాప్తంగా 894 ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు మొత్తం 63 ఉన్నాయి. రోజూ సుమారుగా 20 వేల పైగా విద్యార్థినులు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. గతంలో రవాణా ఖర్చుల కోసం విద్యార్థినులకు వారి తల్లిదండ్రులు బస్సుచార్జీలు ఇచ్చే స్థోమత లేక గ్రామీణా ప్రాంతాల్లో బాలికలు చదువును మధ్యలోనే ఆపేసిన సంఘటనలు కోకొల్లాలు. ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఈ సౌకర్యం మహిళలకు, వీరికి ఎంతో ఉపయోగకరంగా మారింది. కాస్తో కూస్తో ఆర్థికంగా ఉన్నవారి వారి పిల్లలు ఉచిత బస్సు పాస్‌ తీసినా పల్లెవెలుగు బస్సు పాస్‌ మాత్రమే అప్పుడు తీసేవారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణిస్తున్నారు..