Tuesday 14th of May 2024

తగ్గిన దిగుబడి

14 Dec , 2023 12:35 , IST
Article Image

ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్‌ (వి)కి చెందిన వైనాల కిషన్‌రావు. ఐదెకరాల్లో వరి పంట సాగు చేశాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పంట బాగా ఉండటంతో పెట్టుబడికి రాజీపడలేదు. పొట్ట దశలో తెగుళ్లను తట్టుకోలేదు. ఎన్ని రకాల పురుగు మందులు పిచికారీ చేసినా.. ఫలితం లేదు. పైగా ‘మిచాంగ్‌’ ప్రభావంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గిందని వాపోతున్నాడు. జిల్లా వ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి ఇలాగే ఉంది.ఈ ఏడాది వరి రైతులకు అప్పులే దిగుబడులయ్యాయి. అతివృష్టి, అనావృష్టితో రైతులకు రుణాలే మిగిలాయి. ఈ వానాకాలంలో సాగుకు సమయానుకూలంగా వరణుడు కరుణించకపోవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభా వాన్ని చూపింది. పెట్టుబడి విషయంలో రాజీపడకుండా ముందుకు సాగిన రైతుకు తగ్గిన దిగుబడుతో చివరికి నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. వానాకాలంలో వరికి పెట్టుబడి భారీగా పెరిగింది. విత్తనాల కొనుగోలు నుంచి వరి కోత వరకు భారీగా పెట్టుబడి పెరిగింది. ఇలా మొత్తం ఖర్చు రూ.22 వేల నుంచి రూ. 23 వేలకు చేరుతోంది. కౌ లుకు ఎకరాకు రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది.ప్రస్తుత వానాకాలం ప్రారంభంలో వరికి వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రభుత్వం, అధికారులు సన్న రకాలను పండించాలని తెలపడంతో చా లా మంది రైతులు ఈ ఏడాది సన్నరకాలను సాగు చేశారు. అయితే వాతావరణం అనుకూలించక కొ న్ని ప్రాంతాల్లో తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. కేవలం ఎకరాకు 16 నుంచి 20 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఇందులోనూ 5 బస్తాల వరకు తాలు కింద పోతుందన్నారు.పెట్టుబడి భారమైన దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో వరికోతలకు సమాయత్తమైన రైతులకు ‘మిచాంగ్‌’ తీరని శోకం మిగిల్చింది. తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా నేలవాలింది. దీంతో గింజ నాణ్యత, ధరపై ప్రభావం చూపనుందని రైతులు వాపోతున్నారు.కోతకొచ్చిన పంట చేతికొచ్చే వేళ మిచాంగ్‌ తుపాను ప్రభావంతో వరి పొలాలన్నీ నేలవాలాయి. పొలాల్లో అధిక తేమ ఉండటంతో చైన్‌ హార్వెస్టర్‌లతో కోత కోయాల్సి రావడంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వరి కోతలకు వినియోగించే టైర్‌ హార్వెస్టర్‌ అద్దె గంటకు రూ.2,000 నుంచి రూ.2200 వసూలు చేస్తున్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పొలాల్లో తడి ఆరక టైర్‌ హార్వెస్టర్లు దిగబడుతుండటంతో చైన్‌ హార్వెస్టర్లను వినియోగించాల్సి వస్తోంది. ఇవి తెలంగాణలో తక్కువ సంఖ్యలో ఉండటంతో కొందరు పక్క రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకువచ్చి డిమాండ్‌ను బట్టి గంటకు రూ.3,500 నుంచి రూ.4,500 వరకు వసూలు చేస్తున్నారు..