Tuesday 14th of May 2024

దడ పుట్టిస్తున్న సన్న బియ్యం!

14 Dec , 2023 12:41 , IST
Article Image

సన్న బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సన్న బియ్యం(బీపీటీ పాతవి) ధర క్వింటాకు రూ.5600 వరకు ఉంది. వీటి ధరలు తగ్గకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సన్నబియ్యం తినడానికి ఇష్టపడుతుండడంతో వీటి వినియోగం పెరిగింది. కానీ వినియోగానికి తగ్గట్లు సన్న రకం ధాన్యం సాగు లేదు. దొడ్డు రకమే ఎక్కువగా పండిస్తున్నారు. దీంతో సన్న బియ్యానికి ధరలు పెరుతున్నాయి.ఇటీవల వాన కాలం సీజన్‌లో సన్న బియ్యానికి సంబంధించిన వరి పంట తక్కువగా సాగు చేశారు. కేవలం దొడ్డు రకానికి చెందిన పంటలే ఎక్కువగా సాగు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రధానంగా నెల్లూరు జిల్లా నుంచి ఎక్కువగా ఇతర ప్రాంతాలకు సన్న బియ్యం సరఫరా అవుతుంది. ఇటీవల అక్కడ కురిసిన మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో వరి పంట దెబ్బతిన్నది. దీంతో సన్న బియ్యం దిగుబడి తగ్గిపోయింది. క్వింటా బియ్యానికి (కొత్తవి) ప్రస్తుతం రూ.4వేల నుంచి రూ.4500 ఉంది. పాత బియ్యం అయితే క్వింటాకు రూ.5200 నుంచి రూ.5600ల వరకు విక్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని మిల్లర్లు సైతం బియ్యాన్ని నిల్వ చేసుకోవడంతో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.గతేడాది సన్న బియ్యం ధర క్వింటాకు కొత్తవి రూ.3 వేల నుంచి రూ.3500 వరకు ఉంది. పాతవి క్వింటాకు ధర రూ.3500 నుంచి రూ.4200 వరకు విక్రయించారు. సన్న రకానికి చెందిన వరి పంట సాగు తక్కువగా ఉండటంతో ఈ బియ్యానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మున్ముందు ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని భావించి ప్రస్తుతం వినియోగదారలు బియ్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. .