Tuesday 14th of May 2024

ఎస్‌ఎంసీ ఎన్నికలెప్పుడో?

14 Dec , 2023 12:46 , IST
Article Image

● నాలుగేళ్లుగా కొనసాగుతున్న వాయిదాల పర్వం ● తాజాగా మరోనెల పొడిగింపు ● పాఠశాలలపై కొరవడిన పర్యవేక్షణ.విద్యాభిమానులు, తల్లిదండ్రుల సహకారంతో విద్యాశాఖ నిర్దేశించిన లక్ష్యాలను ఉపాధ్యాయులు సులభంగా సాధించేందుకు పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ)లను ఏర్పాటు చేశారు. ఇవి పాఠశాల అభివృద్ధితోపాటు వివద్యార్థులకు సరైన విద్య, నాణ్యమైన భోజనం అందించేందుకు వారధిగా పనిచేసేందుకు ఈ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇలాంటి ప్రాధాన్యం కమిటీల నిర్వహణ ప్రస్తుతం నీరుగారుతోంది.కమిటీ చైర్మన్‌, సభ్యుల పదవీ కాలం రెండేళ్లపాటు ఉంటుంది. అయితే పదవీ కాలం ముగిసి నాలుగేళ్లవుతున్నా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రస్తుతం ఉన్న కమిటీల పదవీకాలం నవంబరు 30వ తేదీతో ముగిసింది. వాటిని డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన వారం క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్లుగా పాఠశాలలకు కమిటీల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలన గాడితప్పిందని విద్యావంతులు పేర్కొంటున్నారు.విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నిర్వహణతో పాటు ప్రతీ సంక్షేమ పథకంలో ఎస్‌ఎంసీ కమిటీలను ప్రభుత్వం బాధ్యులను చేసింది. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేవిధంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా పాత కమిటీలను కొనసాగిస్తుండడంతో చాలా బడుల్లో కమిటీ సభ్యుల విద్యార్థులు పై చదువులకు వెళ్లారు. దీంతో వారు సరిగ్గా పర్యవేక్షించలేకపోతున్నారు. తనిఖీలు లేకపోవడంతో జిల్లాలో అక్కడక్కడ తరచూ మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో పాటు ప్రతీనెలా సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధికి, ఉత్తీర్ణతశాతం పెంచడానికి ప్రణాళిక రూపొందించి అమలుకు ఎస్‌ఎంసీలు సహకరిస్తుంటారు. ఆవాస ప్రాంతాల్లోని బడిబయట ఉండే పిల్లలను పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేయడంతోపాటు పాఠశాల్లో హాజరు శాతం పెంచేలా కృషిచేస్తుంటారు. మౌలిక సదుపాయాల కల్పనలో సహాయ పడడం, జాతీయ పండగలను పాఠశాలల్లో నిర్వహించేలా చూడాలి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు విద్యార్థులకు సక్రమంగా అందేలా చూస్తూ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టే విధంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ వీటన్నింటిపై ఎస్‌ ఎంసీ పర్యవేక్షణ లేకపోవడంతో అనుకున్న లక్ష్యా లేవీ నెరవేరడం లేదనే విమర్శలు వస్తున్నాయి..