Tuesday 14th of May 2024

డీసీసీబీ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు

14 Dec , 2023 12:55 , IST
Article Image

● గత ఏడాది లాభాల ఆధారంగా ప్రకటన ● ఏజెన్సీ రైతులకు రూ.1.50 లక్షల మార్ట్‌గేజ్‌ రుణం ● పాలకవర్గ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం .అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో పనిచేసే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించేందుకు పాలకవర్గం సానుకూలత వ్యక్తం చేసింది. బ్యాంకు చైర్మన్‌ కూరాకుల నాగభూషణం అధ్యక్షతన బుధవారం ఖమ్మం గాంధీచౌక్‌లోని ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. 2022–23 ఆర్థిక సంవత్సరం బ్యాంకు సాధించిన ఆర్థిక ప్రగతి ఆధారంగా రెండు నెలల వేతనాన్ని ప్రోత్సాహకంగా ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు విన్నవించాయి. అయితే, నికర లాభం రూ.1.64 కోట్ల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించింది. అలాగే, ఏజెన్సీ ప్రాంతంలో పట్టా భూములు ఉన్న రైతులు ఎకరాకు రూ.1.50లక్షల చొప్పున మార్ట్‌గేజ్‌ రుణాలు ఇవ్వాలని తీర్మానించారు. కాగా, మూడేళ్లుగా బ్యాంకు ఆధ్వర్యాన స్టడీటూర్‌కు తీసుకెళ్లడం లేదని కొందరు ప్రస్తావించగా పరిశీలిస్తామని చెప్పడంతో పాటు ఆదాయ, వ్యయాలపై చర్చించారు.డీసీసీబీ సీఈఓగా అబీద్‌ ఉర్‌ రెహమాన్‌ బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. గడిచిన అక్టోబర్‌లో సీఈఓ అట్లూరి వీరబాబు పదవీకాలం మగి యడంతో జనరల్‌ మేనేజర్‌ నర్మదను ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆతర్వా త ఇంటర్వ్యూల ఆధారంగా ఎస్‌బీఐ రిటైర్డ్‌ అధికారి రెహమాన్‌ను ఎంపిక చేయగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన మూడేళ్లుగా ఖమ్మం డీసీసీబీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో కొనసాగుతుందని తెలిపారు. బ్యాంకును మరింత అభివృద్ధి చేసేలా అందరి సహకారంతో కృషి చేస్తానని వెల్లడించారు..