Tuesday 14th of May 2024

సన్నాలు కరువు..

14 Dec , 2023 01:08 , IST
Article Image

సన్న ధాన్యం సాగు తగ్గిపోవడంతో డిమాండ్‌ ఎక్కువై ధరలు పెరుగుతున్నాయి. సన్న బియ్యం వినియోగం ఎక్కువగా ఉండటం, అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్‌ మండలంలో వానాకాలం సీజన్‌లో 13వేల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇందులో 10వేల ఎకరాల్లో దొడ్డు రకం, 3వేల ఎకరాల్లో మాత్రమే సన్న రకం పండించారు. దొడ్డు రకం ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. గతంలో సన్నాలను కూడా కేంద్రాల్లో విక్రయించిన రైతులు.. ప్రస్తుతం ఒక్క క్వింటాల్‌ కూడా తీసుకురాలేదు.సన్నాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడటంతో రైసుమిల్లర్లు పెద్దఎత్తున రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్ధతు ధర గ్రేడ్‌–ఏ రూ.2203, సాధారణ రకం రూ.2180 చెల్లిస్తుంది. అయితే సన్నాలను ఈ ధరకు రైతులు అమ్ముకుంటే నష్టపోయే అవకాశముండటంతో రైసుమిల్లర్లకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు సైతం హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, బీపీటీ వంటి సన్న రకాలకు క్వింటాల్‌కు రూ.2,600 నుంచి రూ.2,800 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ధరను మించి రైసుమిల్లర్లు కొనుగోలు చేస్తుండటంతో రైతులు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొంతమంది రైతులు ధరలు మరింత పెరిగే అవకాశముందనే ఉద్దేశంతో ధాన్యాన్ని విక్రయించకుండా నిల్వ చేస్తున్నారు. సన్నాలను బియ్యం పట్టించి నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మిల్లర్లు ధాన్యాన్ని కొంటున్నారు. రైతులు సైతం రైసుమిల్లుల్లో సన్నాలను పట్టించి తినేందుకు వీలుగా సరిపడే బియ్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు.రెండేళ్లలో సన్న రకాలకు తక్కువ ధరలే ఉండగా.. ఈ సీజన్‌లో అనూహ్య రీతిలో ధరలు పెరిగాయి. ప్రధానంగా జైశ్రీరాం రకానికి రూ.3వేల వరకు ధర పలుకుతోంది. రైసుమిల్లర్లు ఈ ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులు సైతం జైశ్రీరాం బియ్యం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. క్వింటాల్‌కు రూ.5,800నుంచి రూ.6వేల ధర ఉంది. బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, హెచ్‌ఎంటీ తదితర సన్న బియ్యానికి క్వింటాల్‌కు రూ.4,200 ధర పలుకుతోంది. రాబోయే రోజుల్లో సన్న బియ్యానికి మరింత ధరలు పెరిగే అవకాశముందనే ఉద్దేశంతో పలువురు వినియోగదారులు ఇపుడే బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. .