Monday 13th of May 2024

బాధ్యత వరకే పరిమితం..

14 Dec , 2023 01:15 , IST
Article Image

గృహ నిర్మాణ సంస్థ జిల్లా కార్యాలయం తలుపులు మళ్లీ తెరుచుకునే అవకాశాలు ఉ న్నాయి. కాంగ్రెస్‌ సర్కార్‌ ఈ సంస్థను పునరుద్ధరణ చేసే యోచనలో ఉంది. గతంలో గృహ నిర్మాణాల పరంగా ఈ సంస్థదే కీలక పాత్ర. అయితే ఏడాది క్రితం దీన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్‌అండ్‌బీలో విలీనం చేసింది. దీంతో స్వయంప్రతిపత్తి కోల్పోయింది. మళ్లీ ఈ సంస్థను పునరుద్ధరించనున్నట్లు యోచిస్తున్న నేపథ్యంలో హర్షం వ్యక్తమవుతోంది.● గృహ నిర్మాణ సంస్థ పునరుద్ధరణ యోచనలో సర్కారు ● ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రాధాన్యత నేపథ్యంలో.. ● ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు.బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో గృహ నిర్మాణ సంస్థను విలీనం చేసిన తర్వాత నోడల్‌ ఆఫీసర్‌గా ఈ సంస్థకు చెందిన అధికారి బసవేశ్వర్‌ వ్యవహరిస్తున్నారు. సంస్థకు చెందిన నలుగురు అధికారులు మాత్రమే ప్రస్తుతం బాధ్యతల నిర్వహణలో ఉన్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్‌ నుంచి సాంక్షన్‌ వచ్చినటువంటి ఇళ్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో అమలు, వాటి పురోగతి, బిల్లుల చెల్లింపునకు సంబంధించి నివేదిక రూపొందించే వరకే ఈ నోడల్‌ అధికారులదే బాధ్యత. ఇక ఇళ్ల నిర్మాణాన్ని అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎగ్జిక్యూటీవ్‌ (కార్యనిర్వాహక) ఏజెన్సీలుగా ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. ఆయా శాఖల ఆధ్వర్యంలోనే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాల నిర్మాణ పనులు సాగాయి. తద్వారా పురోగతి నివేదికల తయారీ వరకు మాత్రమే నోడల్‌ అధికారుల బాధ్యత ఉండేది. క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఎగ్జిక్యూటీవ్‌ ఏజెన్సీల ఆధ్వర్యంలో సాగేది.గృహ నిర్మాణ సంస్థను పునరుద్ధరిస్తే దీనికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆనందం సంస్థలో ప్రస్తుతం బాధ్యత నిర్వహిస్తున్న కొంత మంది అధికారుల్లో వ్యక్తమవుతుంది. ఈ సంస్థకు సంబంధించి హైదరాబాద్‌లో కార్పొరేషన్‌ అదే విధంగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి ముందు నుంచి ఉన్న కార్యాలయంలోనే నోడల్‌ అధికారుల ఆఫీస్‌ కొనసాగుతుంది. అయితే ఇందులో వేళ్ల మీద లెక్కించే సిబ్బంది మాత్రమే ప్రస్తుతం కనిపిస్తారు. విలీనానికి ముందు ఈ సంస్థ కార్యాలయంలో నిత్యం క్షేత్రస్థాయి సిబ్బంది రాకపోకలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ, నివేదికల తయారీ అన్నీ ఇక్కడినుంచే సాగేవి. మళ్లీ పునరుద్ధరణకు నోచుకుంటే క్షేత్రస్థాయిలో డీఈలు, ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఇలా అన్ని పోస్టులను పునరుద్ధరించే పరిస్థితి ఉంటుంది. తద్వారా ఈ శాఖకు మళ్లీ వైభవం వస్తుందని అధికారులు చెబుతున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఇక్కడినుంచే మంజూరు ఇవ్వడం, కార్యాలయం నుంచే పనుల నివేదికలు రూపొందించడం, క్షేత్రస్థాయిలో సొంత సిబ్బందితో నిర్మాణం చేపట్టడం వంటివి జరుగుతాయి. కాంగ్రెస్‌ సర్కార్‌ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రాధాన్యత అంశంతో ముందుకొస్తున్న నేపథ్యంలో ఈ సంస్థకు గత వైభవం వస్తుందని పలువురు పేర్కొంటున్నారు..