Tuesday 14th of May 2024

ఆదిలాబాద్‌కు అడవే అందం. పర్యాటకానికి కొత్త శోభ

14 Dec , 2023 01:19 , IST
Article Image

1.అభివృద్ధికి సీఎం హామీ. 2.ప్రతిపాదనలు పంపించాలని  ఎమ్మెల్యేలకు సూచన. 3.విశేష స్థలాలు, దేవాలయాల  సమాచార సేకరణ. 4.సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకులకు స్వర్గధామం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దట్టమైన అడవులు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, జాలువారే జలపాతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అందాల కశ్మీర్‌కు మన ఆదిలాబాద్‌కు చాలా విషయాల్లో సారుప్యత కనిపిస్తుందని సీఎం కేసీఆర్‌ సైతం పలుమార్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ను తెలంగాణ కశ్మీర్‌గా సీఎం కేసీఆర్‌ చెబుతుంటారు. గతంలోనే కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఇటీవల సీఎం కేసీఆర్‌ సైతం అసెంబ్లీలో పర్యాటకంపై ప్రస్తావించారు. ఇరువురి ప్రకటనలతో ఒక్కసారిగా మళ్లీ పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఆశ ఉమ్మడి జిల్లా వాసుల్లో పెరిగింది. చదువుల తల్లి నిలయమైన బాసర నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ప్రత్యేక ప్రాంతాలు, జలపాతాలను సందర్శించేలా టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక సర్క్యూట్‌ ఏర్పాటు చేయవచ్చు. సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నాక ఉమ్మడి జిల్లాలోని ఎన్నో విశేషాలను చూస్తూ ముందుకు వెళ్లవచ్చు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఉమ్మడి జిల్లాలో పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. నేరడిగొండ మండలం కుంటాల సమీపంలో 200 అడుగుల పైనుంచి కిందికి నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఈజలపాతం వద్ద ఇప్పటికే సినిమా షూటింగ్‌లు చిత్రీకరిస్తారు. సమీపంలోనే పొచ్చర జలపాతం ఉంది. వర్షాకాలంలో ఇక్కడ బండరాళ్లపైనుంచి 20 మీటర్ల లోతున నీళ్లు జారిపడుతుంటాయి. నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్లేమార్గంలో వెలుగులోకి రాని వాస్తాపూర్‌ జలపాతం ఉంది. ఇచ్చోడ మండలం తర్నం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గాయిత్రి జలపాతం, జైనూర్‌ మండలం మెట్టగూడ అడవి ప్రాంతంలో సప్తగుండాల జలపాతం, బజార్‌హత్నూర్‌ మండలంలో కన్‌కయి జలపాతం, తాంసి మండలంలో గుంజాల జలపాతం ఉన్నాయి..