Tuesday 14th of May 2024

రైతులను ఉదారంగా ఆదుకోండి

14 Dec , 2023 01:25 , IST
Article Image

రూ.286.33 కోట్ల పరిహారమివ్వాలి కేంద్ర బృందానికి ఎమ్మెల్యే తిప్పేస్వామి వినతి మడకశిర నియోజకవర్గంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట నష్ట పోయిన రైతులకు రూ.286.33 కోట్ల పంట నష్ట పరిహారాన్ని మంజూరు చేయాలని కేంద్ర కమిటీ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి కోరారు. బుధవారం ఆయన కేంద్ర బృందం సభ్యులను కలిసిన అనంతరం ‘సాక్షి’తో మట్లాడారు. మడకశిర నియోజకవర్గంలో 47,157 మంది రైతులు 19,702 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకునేలా చూడాలని కేంద్ర బృందం సభ్యులకు సమర్పించిన వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. అదే విధంగా పంటరుణాలపై వడ్డీ మాఫీ, పంట రుణాలను రీషెడ్యూల్‌, డ్రిప్‌పై 100 శాతం సబ్సిడీ, 125 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులను మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. రేరింగ్‌షెడ్లపై సబ్సిడీ పెంచి పట్టు రైతులను ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని కోరినట్లు తెలిపారు.తీవ్ర అనావృష్టితో పంటలను కాపాడుకోలేక రైతులు నష్టపోయారని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతుల కష్టాలను తీర్చేందుకు తగిన సాయమందించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ కేంద్ర బృందాన్ని కోరారు. పరిగి మండలం మోదాలో కేంద్ర బృందం సభ్యులతో మాట్లాడిన ఆయన... ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం కారణంగా రైతుల పరిస్థిఽతి దయనీయంగా మారిందని వెల్లడించారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర నష్టాన్ని చవిచూశారన్నారు. రైతులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించి ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా హంద్రీనీవా మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ మోదా గ్రామం మీదుగా ఉన్నప్పటికీ మోదా రెండు చెరువులకు కృష్ణా జలాలను సరఫరా చేయడానికి సబ్‌ కెనాల్‌ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేయడానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేలా నివేదించాలని కోరారు.తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన జిల్లా రైతులను కేంద్రం ఉదారంగా ఆదుకునేలా నివేదికలు అందజేయాలని ఎమ్మెల్యేలు శంకరనారాయణ, తిప్పేస్వామి కేంద్ర బృందం సభ్యులను కోరారు. జిల్లాలో 21 మండలాలను కరువు జాబితాలో చేర్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం (ఐఎంసీటీ) బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ డైరెక్టర్‌ అండ్‌ మానిటరింగ్‌ అప్రైజల్‌ పి.దేవేంద్రరావు, డెయిరింగ్‌ రీజనల్‌ ఫాడర్‌స్టేషన్‌ ఎస్‌టీఏ అంజు బసేరా, ఎంఎన్‌సీఎఫ్‌సీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌తో కూడిన సభ్యుల బృందం పరిగి, మడకశిర, అమరాపురం, గుడిబండ మండలాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడి పంటలసాగుకు పెట్టిన పెట్టుబడులు, వర్షాభావంతో కలిగిన నష్టాన్ని తెలుసుకుంది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఏడీఏలు అల్తాఫ్‌ ఆలీ, కృష్ణయ్య, డీఏహెచ్‌ఓ శుభదాస్‌, డీడీఏ పెంచలయ్య, డీహెచ్‌ఓ చంద్రశేఖర్‌, డీఎస్‌ఓ శోభారాణి, ఏపీ ఎంఐపీ పీడీ సుదర్శన్‌, సీపీఓ విజయ్‌కుమార్‌, డీవైఎస్‌ఓ మల్లికార్జున, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రషీద్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడీ విజయ్‌ప్రసాద్‌, ఏపీడీ శివానందనాయక్‌, ఇరిగేషన్‌ డీఈ లక్ష్మీనారాయణ, తహసీల్దారు సౌజన్యలక్ష్మీ, ఎంపీడీఓ సరస్వతి తదితరులు పాల్గొన్నారు..