Monday 29th of April 2024

గుడ్డు.. సరికొత్త రికార్డు

14 Dec , 2023 01:27 , IST
Article Image

తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య, మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో రూ.ఏడు నుంచి రూ.7.50 పలుకుతుండటంతో సామాన్యులు వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. రిటైల్‌ మార్కెట్‌లో గుడ్డు ధర బాగా పెరిగిపోవడం పౌల్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక ధరతో వినియోగం తగ్గితే ఆ ప్రభావం మళ్లీ పరిశ్రమపై పడుతుందంటున్నా రు. కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పెరిగినా లేదా ఒకే సారి తగ్గినా ఆ ప్రభావం రంగంపై విస్తృతంగా ఉంటుందని కోళ్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కోడిగుడ్డు ధర కొండెక్కింది.. జాతీయ గుడ్లు సమన్వయ కమిటీ (నెక్‌) చరిత్రలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం పౌల్ట్రీ వద్ద గుడ్డు రైతు ధర రూ.5.76కు చేరడంతో పాత రికార్డులను తిరగరాసింది. నాలుగేళ్ల కాలంలో ఇదే అత్యధిక రైతు ధర కావడం విశేషం. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన మేత ధరలతో గుడ్డు ధర పెరిగినా ప్రయోజనం అంతంత మాత్రమేనని కోళ్ల రైతులు అంటున్నారు. మరోపక్క రిటైల్‌ మార్కెట్‌లో గుడ్డు రూ.7కు చేరడంతో వీటి కొనుగోలుకు సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. కార్తిక మాసం పూర్తి కావడంతో పాటు వచ్చే క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కేక్‌ల తయారీలో అధికంగా గుడ్లు ఉపయోగించడం వల్ల వాటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 200 వరకూ పౌల్ట్రీలు ఉన్నాయి. ఇందులో మండపేట, అనపర్తి, పెద్దాపురం, జగ్గంపేట, రాజానగరం, రంగంపేట, రాజమహేంద్రవరం రూరల్‌, ఆలమూరు మండలాల్లో ప్రధానంగా ఈ పౌల్ట్రీలు నడుస్తున్నాయి. ఆయా చోట్ల మొత్త గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకూ ఉండగా, రోజుకు సరాసరి 1.20 కోట్ల వరకూ కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 60 శాతం మేర గుడ్లు ఒడిశా, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా, మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తక్కువగా ఉండటంతో గుడ్ల వినియోగం పెరుగుతుంది. ఇందులో భాగంగా గుడ్లు ఎగుమతులు పుంజుకొని ధర ఆశాజనకంగా ఉంటుంది. ఏటా శీతాకాలంలో అత్యధిక రైతు ధర నమోదయ్యేది కాని ఈ ఏడాది మాత్రం రికార్డు స్థాయికి చేరుకుని కోళ్ల రైతులను సైతం ఆశ్చర్యపరిచింది. 2017 సీజన్‌లో రైతు ధర దాదాపు రూ.5.45కు చేరి అత్యధిక ధరను నమోదు చేసుకుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో నాలుగేళ్లుగా పౌల్ట్రీ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటోంది. నాలుగేళ్ల నుంచి సీజన్‌లో సైతం రైతు ధర రూ. ఐదు దాటడం గగనమైంది. ఈ సీజన్‌లో చలి తీవ్రత పెరగడంతో ఆ మేరకు జిల్లా నుంచి గుడ్లు ఎగుమతులకు డిమాండ్‌ ఏర్పడి ధర ఆశాజనకంగా ఉందని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. రైతు ధర బుధవారం రూ. 5.76కు చేరి సరికొత్త రికార్డును నెలకొల్పింది. శీతల ప్రభావం నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ధర కొనసాగవచ్చని భావిస్తున్నారు..