Tuesday 14th of May 2024

'తాతను మరచి ముందుకు సాగిన మ‌నుమ‌డి' పాద‌యాత్ర‌!

14 Dec , 2023 01:34 , IST
Article Image

జెండాల హడావుడే గానీ జనం సందడి లేని నారా లోకేష్‌ పాదయాత్ర జిల్లాలో పేలవంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ తొలిరోజు చప్పగా సాగింది. జేజేలు పలకాల్సిన పార్టీ శ్రేణులు నిరసన గళానికే ప్రాధాన్యమిచ్చాయి. తుని పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో లోకేష్‌ పాయకరావుపేటలోకి అడుగుపెట్టారు.గౌతం సెంటరు వద్ద మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తన అనుయాయులతో స్వాగతం పలికారు. జనం ఆసక్తి చూపకపోయినా.. అదే సమయానికి సినిమాహాళ్ల నుంచి బయటకు వచ్చినవారు, భవన నిర్మాణ పనులకు వెళ్లిన కార్మికులు, విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే ఉద్యోగులు కనిపించడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్‌రోడ్డులో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపేసినా తెలుగు తమ్ముళ్ల జాడ అంతంతమాత్రంగానే ఉంది.పాయకరావుపేటలో అనిత వ్యతిరేక, అనుకూల వర్గాలు ఎవరికి వారు వేర్వేరుగా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు రావడం గమనార్హం. పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పెద్దగా పాల్గొనలేదు. ఆ పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి లోకేష్‌ను కలిశారు. ఈ పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ బుద్దనాగజగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. లోకేష్‌ పాదయాత్ర గౌతం సెంటరు, మంగవరంరోడ్డు మీదుగా పాయకరావుపేట వై జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముందు నుంచే లోకేష్‌ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తాత విగ్రహం ముందు నుంచి వెళ్లి కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్తుపోయారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నారని, ఆయన పెట్టిన పార్టీ లాక్కుని పదవులు అనుభవిస్తూ కనీసం ఆయన విగ్రహానికి దండ వేయకపోవడమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి..