Tuesday 14th of May 2024

మూడు ముక్కల టీడీపీకి మరో సంకటం

14 Dec , 2023 01:40 , IST
Article Image

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలకు కొత్త సంకటం వచ్చి పడింది. అసలే మూడు వర్గాలతో, నిత్యం కొట్లాటలతో సతమతమవుతున్న టీడీపీకి జనసేనతో పొత్తు కారణంగా కొత్తగా మరో గ్రూపు చేరింది. రాజంపేట టీడీపీని మరింత రగిలిస్తోంది. పొత్తులో భాగంగా రాజంపేట టికెట్‌ తమకేనంటూ జనసేన నేతలు ఘంటాపథంగా చెప్పడం టీడీపీ నేతలకు చిర్రెక్కిస్తోంది.రాజంపేట నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేయాలని టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్‌రాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన అభ్యర్థిత్వానికి పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు మోకాలడ్డుతున్నారు. బత్యాల నాన్‌ లోకల్‌ అభ్యర్థి, పోటీలో నిలిపినా నిరుపయోగమేనంటూ ప్రచారం చేస్తున్నారు.ఇంకోవైపు రాజంపేట ఎంపీగాకంటే అసెంబ్లీకి పోటీచేయాలని గంటా నరహరి ఉవ్విళ్లూరుతున్నారు. బత్యాల, జగన్‌మోహన్‌రాజులకు గట్టిగానే అడ్డం పడుతున్నారు. వీరు చాలదన్నట్టు తాజాగా పోలు సుబ్బారెడ్డి, మేడా విజయశేఖర్‌రెడ్డి రేసులోకి వచ్చారు. వీళ్ల మధ్య నిత్యం కొట్లాటలతో కేడర్‌ క్రమంగా తగ్గిపోతోంది. ఇప్పుడు పొత్తులో మాకే సీటంటూ జనసేన నేతలు రంగంలోకి వచ్చారు.రాజంపేట నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జి మలిశెట్టి వెంకటరమణ టిక్కెట్‌ తనదేనంటున్నారు. మలిశెట్టికంటే తానే మెరుగైన అభ్యర్థి అంటూ అతికారి దినేష్‌ మరోపక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉన్నతోద్యోగానికి వీఆర్‌ఎస్‌ ఇచ్చిన శ్రీనివాసరాజు తానే జనసేన అభ్యర్థినంటూ తెరపైకి వచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిని తానేనంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నేతల కొట్లాటలతో టీడీపీ, జనసేన వర్గాలు కకావికలవుతున్నాయి..