Monday 13th of May 2024

మైనారిటీలకు అండగా జగనన్న సర్కారు.

14 Dec , 2023 01:47 , IST
Article Image

● సిఫార్సులు లేకుండా గడప వద్దకే సంక్షేమం ● ముస్లిం మైనారిటీలకు చేయూత ● మంత్రి ఆర్కేరోజా మైనారిటీలకు అండగా జగనన్న సర్కారు నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువ జన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. మున్సిపల్‌ పరిధిలోని కొత్తపేటలో ముస్లిం మైనారిటీలు అధికంగా నివశించే 23, 24 వార్డుల్లో మంగళవారం మంత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానికులు ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలసి ప్రతి గడపకూ వెళ్లి గత నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికీ చేకూరిన లబ్ధిని గణాంకాలతో స్థానికులకు వివరించి, సంక్షేమ బుక్‌లెట్‌లను అందజేశారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించవచ్చని, ప్రజల కోసమే నగరిలో నివాసమేర్పరచుకున్నానని తెలిపారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని, చల్లని ఫ్యానుగాలి లాంటి పాలనను కొనసాగించే జగనన్ననే మళ్లీ సీఎంని చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలందరినీ ఇంటికి పిలిచి రంజాన్‌ వేడుకలు నిర్వహించడంతోపాటు ప్రతి ముస్లిం ఇంటికీ విందు భోజనం పంపిన నేత మీరొక్కరే అంటూ మంత్రిని ప్రశంసించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తమ పాలనలో ముస్లింలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయూత అందిస్తున్నామన్నారు. గతంలో పాలించిన టీడీపీ నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలకు కనిపించేవారన్నారు. ఎన్నికల్లో చెప్పిన హామీలు తుంగలో తొక్కుతారని, అందుకే వారు మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు ప్రజలకు కనిపించకుండా తిరిగేవారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అలాకాదన్నారు. చెప్పిన ప్రతి హామీని తాము నెరవేర్చామని, ప్రతి గడపకూ లబ్ధి చేకూర్చామని, నిత్యం ప్రజల మధ్యే తిరుగుతున్నామన్నారు. పేదవాని ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నందన టీడీపీ నేతలు ప్రజలను ఏమార్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. వారి పాలనలో చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకునేందుకు ఏదీ లేదు కనుక మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వారి ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. మభ్యపెట్టేదెవరో, మంచి చేసేదెవరో ఆలోచిస్తే ప్రజలకే స్పష్టమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ వీవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, మున్సిపల్‌ సచివాలయ కన్వీనర్‌ దయానిధి, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ, కౌన్సిలరు బీడీ భాస్కర్‌, నాయకులు సలీం, సాధిక్‌, బషీర్‌, బాషా, జాకీర్‌, సలీం, శక్తివేలు రెడ్డి, శ్రీనివాసులు, ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు..