Tuesday 14th of May 2024

అర్ధమండల దీక్షలు ప్రారంభం

14 Dec , 2023 01:54 , IST
Article Image

తుపాను నష్టం వివరాలను సమగ్రంగా సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేంద్ర రత్నూ అన్నారు. రాజేంద్ర రత్నూతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఏడీ మహేంద్ర చెందేలియా, రోడ్డు రవాణా, హైవేస్‌ ఎస్‌ఈ రాకేష్‌కుమార్‌తో కూడిన బృందం బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. కంకిపాడు రైతుభరోసా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం పరిశీలించింది. మిచాంగ్‌ తుపానుతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు వాటిల్లిన నష్టం, దెబ్బతిన్న రహదారులు, విద్యుత్‌ లైన్లు, వివిధ రంగాలకు వాటిల్లిన నష్టాన్ని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌ కేంద్ర బృందానికి వివరించారు. 1,01,862 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లిందని, 913.62 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వెల్లడించారు. ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన 57 రహదారులు 312 కిలోమీటర్లు, పంచాయతీ రాజ్‌కు చెందిన ఆరు రహదారులు 17.16 కిలోమీటర్లు మేర దెబ్బతిన్నాయని వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర బృంద ప్రతినిధి రాజేంద్ర రత్నూ విలేకరులతో మాట్లాడుతూ తుపాను నష్టంపై మొదటి రోజు కృష్ణా జిల్లా పర్యటన చేపట్టామన్నారు. పంట పొలాల్లో నీరు నిలిచి ఉందని, పనలు దెబ్బతిని ఉన్నాయన్నారు. పంట నష్టంపై జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి సర్వే చేపట్టిందన్నారు. పొలాల్లో మురుగు ఉండటం వల్ల సర్వే పూర్తి స్థాయిలో సాగలేదన్నారు. తుపాను నష్టం, రైతుల పరిస్థితులను ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కై లే అనిల్‌కుమార్‌, మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు కేంద్ర బృందానికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రాఘవరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.పద్మావతి, సివిల్‌సప్లయిస్‌ డీఎం రాజు, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి, జెడ్‌పీటీసీ బాకీ బాబు పాల్గొన్నారు.మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలనుకేంద్ర కమిటీ బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. మండలంలోని రామనపూడి, వలివర్తిపాడు గ్రామాల్లో అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేంద్రరత్నూ, కేంద్ర కమిటీ సభ్యులు, జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత పర్యటించారు. తొలుత పలువురు రైతులతో మాట్లాడారు. రాజేంద్రరత్నూ మాట్లాడుతూ తడిచి, మొక్క మొలిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు. పంట నష్ట పరిహార అంచనాలు సక్రమంగా రూపొందించి రైతులకు న్యాయం చేయాలని సంబంధితశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.పద్మావతి, వ్యవసాయశాఖ ఏడీ నిమ్మగడ్డ రమాదేవి, తహసీల్దార్‌ కె.ఆంజనేయులు, మండల వ్యవసాయశాఖ అధికారి బి.అనంతలక్ష్మి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ నాగబాబు పాల్గొన్నారు..