Monday 13th of May 2024

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి

14 Dec , 2023 01:57 , IST
Article Image

పాఠశాలల్‌ఓల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు జి. దేవి అన్నారు. మండలంలోని పెద ఉల్లగల్లు, ముండ్లమూరు గ్రామాల్లో బుధవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పెద ఉల్లగల్లులో రేషన్‌కార్డుదారులకు వాహనం ద్వారా రేషన్‌ బియ్యం సరఫరా చేస్తుండగా మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సరుకులు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. బియ్యానికి బదులు నగదు ఇస్తామని ఎవరైనా అంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లు తక్కువ బరువు ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి గుడ్లు తింటే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. వెంటనే గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీతో మాట్లాడి గుడ్లు మార్చాలని అసిస్టెంట్‌ ఫుడ్‌ కమిషనర్‌ ప్రభాకర్‌రావును ఆదేశించారు. అనంతరం ముండ్లమూరు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ నాణ్యత లేని చిక్కీలు, కాలం చెల్లిన రాగి పిండి ప్యాకెట్లు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. కాలం చెల్లిన పిండి సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్‌ ఫుడ్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం బాలికలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు. పురుగుల అన్నం, పురుగుల సాంబారు తినలేక పోతున్నామని విద్యార్థులు వాపోయారు. అసలు పండ్లు ఇవ్వడం లేదన్నారు. అనంతరం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలపై చర్చించారు. బియ్యంలో పురుగులు వస్తే మార్చుకునే వెసులుబాటు ఉందా లేదా అని డీఎస్‌ఓ ఉదయభాస్కర్‌ను అడగ్గా వెసులుబాటు ఉందని తెలిపారు. ఆదర్శ పాఠశాలలోనూ విద్యార్థుల భోజనం విషయంలో ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాలలో డిఎస్‌ఓ ఉదయభాస్కర్‌, లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ మొహిసన్‌, జీసీడీఓ మాధవీలత, డీఈఓ కారాలయ ఏడీ ఉదయభాస్కర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ అశోక్‌కుమార్‌, తహసీల్దార్‌ నయీంఅహ్మద్‌, ఎంపీడీఓ హనుమంతరావు, కేజీబీవీ స్పెషలాఫీసర్‌ ఆవుల సునీత, విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలు జి.దేవి కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం స్పెషలాఫీసర్‌ సుజితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళ్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బీసీ వసతి గృహం, ఎస్సీ బాలుర వసతి గృహం, రేషన్‌ దుకాణాన్ని ఆమె బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు. విద్యార్ధులకు విద్యాభివృధ్ది కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఎంఈఓ సుబ్బయ్య, ఎంపీడీఓ కె.యుగకీర్తి, వార్డెన్‌ నరసింహారావు, వైద్యాధికారి మస్తాన్‌బీ, విద్యార్థులు పాల్గొన్నారు. .