Tuesday 14th of May 2024

దేశరక్షకులకు ఏయూ బాసట

14 Dec , 2023 02:00 , IST
Article Image

దేశరక్షణ కోసం చిన్నతనంలోనే పనిచేసే సైనికులు.. ఉద్యోగ విరమణ తరువాత ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తూ.. విద్యార్హతల విషయంలో భంగపడేవారు. సైనికుల సమస్యలకు పరిష్కారం చూపుతూ త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికులకు ఉన్నత విద్యను చేరువచేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా సైనికోద్యోగులకు ఉన్నత విద్య అవకాశాలను, నైపుణ్యం కలిగిన కోర్సులను అందించింది. సైనికులకు మరిన్ని సేవలందించేందుకు సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ని స్కూల్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌గా మార్చింది. దేశరక్షణ కోసం అహర్నిశలు సరిహద్దుల్లో పోరాడుతున్న ఉద్యోగులకు, మాజీ సైనికులకు అవసరమైన విద్యాసంబంధ కోర్సులను అందించాలని ఏయూ సంకల్పించింది. దీన్ని ఆచరణలో పెట్టే దిశగా 2017లో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల వేదికగా ఇండియన్‌ నేవీ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ రీ సెటిల్‌మెంట్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఏయూతో ఒప్పందాలు చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు. ఇంటర్‌ విద్యార్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి డిప్లొమా కోర్సులను అందించడం ప్రారంభించారు. అలా ఒక డిప్లొమా కోర్సుతో మొదలుపెట్టిన ఏయూ అధికారులు ఇప్పుడు 26 డిప్లొమా కోర్సుల్ని అందిస్తున్నారు.కెమికల్, ఎలక్ట్రికల్, అకౌంటింగ్‌–మేనేజ్‌మెంట్, ఆఫీస్‌ మేనేజ్‌మెంట్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్, సెక్యూరిటీ అండ్‌ ఇంటెలిజె¯న్స్‌ సర్విస్, టీచింగ్‌ అండ్‌ ఎడ్యుకేష¯న్‌ సర్వీసెస్, హౌస్‌కీపింగ్, మ్యూజిక్, ఎయిర్‌ఫీల్ట్‌ సేఫ్టీ, అకౌంటింగ్‌ అండ్‌ ఆడిట్‌ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్‌ మేనేజ్‌మెంట్, ఎయిర్‌సేఫ్టీ, మెటరలాజికల్‌ అసిస్టెŒన్స్‌ తదితర కోర్సులు అందిస్తున్నారు. సైనికులకు విద్యనందించాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ని స్కూల్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టడీస్‌గా ప్రత్యేక కేంద్రంగా మార్చి సేవలను విస్తరించారు. ఐఎన్‌ఎస్‌ విశ్వకర్మలో పనిచేస్తున్న సిబ్బందికి డిగ్రీలు అందించే దిశగా అవగాహన ఒప్పందం చేసు­కున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారి­కోసం ప్రత్యేకంగా నూతన ఉపాధి అవకాశాల కల్పన గురించి ఆలోచించిన ఏయూ.. పలు ప్రీ రిలీజ్‌ కోర్సులను ప్రారంభించింది. ఏడాదికి 15 బ్యాచ్‌ల వరకు ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 నుంచి 50 మంది వరకు సైనికోద్యోగులు పాల్గొంటున్నారు..