Tuesday 14th of May 2024

పశువుల్లో ‘గొంతువాపు’ ముందే గుర్తించండి

14 Dec , 2023 02:03 , IST
Article Image

మిచాంగ్‌ తుపాను కారణంగా వాతావరణంలో మార్పు, కలుషిత నీటిని తాగడం వల్ల పశువులకు వ్యాధుల బారిన పడుతుండటం పశుపోషకులను ఆందోళనకు గురిచేస్తోంది. చలిగాలులు వల్ల గాలిలో తేమశాతం పెరిగి పశువులకు శ్వాస సంబంధ వ్యాధులు, తీవ్ర చలి వల్ల పశువులు ఆహారాన్ని నమలలేకపోవడంతో అజీర్ణ వ్యాధులు, శిలీంద్రాల కారణంగా చర్మవ్యాధులు శీతాకాలంలో సంక్రమిస్తున్నాయి. దీంతో పాడి పశువుల్లో పాల దిగుబడి, వెన్నశాతం తగ్గుతోంది. ముఖ్యంగా పశువుల్లో గొంతు వాపు వ్యాధి సోకుతుండటంతో పశుసంవర్దక శాఖ అధికారులు అప్రమత్తమై గ్రామాల్లో పశువులకు ఉచితంగా టీకాలు వేస్తున్నారు.ఏలూరు జిల్లాలో ఆవులు 1,36,549, గేదెలు 5,12,142, గొర్రెలు 5,26,836, మేకలు 1,98,810 ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో నానాటికి పగటి ఉష్ణోగ్రతలు తగ్గితున్నాయి. దోమలు, జోరీగలు, పిడుదులు, గోమార్ల ఉధృతి పెరుగుతోంది. పాడి పశువుల్లో గొంతువాపు వ్యాధి కలవరపెడుతోంది. పాశ్చురెల్లా హిమోలైటికా అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. బర్రెలతోపాటు ఆవులు, మేకలు, గొర్రెలలో ఇది కనిపిస్తుంది. ఈ వ్యాధి నివారణకు సరైన చర్యలు తీసుకోవడం ద్వారా పాడి పశువులను కాపాడుకోవచ్చని కై కలూరు పశుసంవర్దకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ పఠాన్‌ ముస్తాఫాఖాన్‌ చెప్పారు. ఈ వ్యాధి నివారణకు పశుపోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.వ్యాధి కారకాలు పశువుల శరీరంలోకి ప్రవేశించిన 8 నుంచి 32 గంటల వ్యవధిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏ లక్షణం కనిపించకుండానే ఆకస్మికంగా మరణిస్తుంటాయి. మేత, నెమరు మందగించుట, పాలు నిలిచిపోవుట జరుగుతుంది. గొంతు కింది భాగంలో జలవాపు ప్రారంభమై క్రమంగా మెడ కింది భాగానికి, ఆ తర్వాత కాళ్ల మధ్య ఎదురు రొమ్ము కిందికి చేరుతుంది. పశువు తీవ్రమైన ఆయాసంతో రొప్పుతూ గురకపెడ్తూ ముక్కు నుంచి, నోటి నుంచి నురగ వంటి స్రావాలను కారుస్తుంటుంది. చెవి ప్రాంతంలో విపరీతమైన వేడి ఉంటుంది. కళ్లు ఎరగ్రా మారుతాయి. కొన్ని సందర్భాల్లో చాక్లెట్‌ రంగులో కనిపిస్తాయి. వ్యాధి కారక పశువులు గుర్రగుర్ర మంటూ శబ్ధం చేస్తాయి.రక్త పరీక్ష చేయించి బైపోలార్‌ గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియాను గుర్తించటం వల్ల వ్యాధిని నిర్ధారిస్తారు. పశువు చనిపోయిన తరువాత శవ పరీక్ష చేసి కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు. దీని నివారణకు 30 మిల్లీలీటర్ల సల్ఫాడిమిన్‌ మందులు 3 రోజుల పాటు రక్తంలో ఎక్కించాలి. చర్మం కింది కండకు కూడా మందును ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వవచ్చు. క్లోరంఫెనికాల్‌, ఆక్సిటెట్రాసైక్లిన్‌, సెఫట్రైక్సోమ్‌, సల్ఫామందులను 15 మిల్లీ లీటర్ల మోతాదులో మూడు రోజుల పాటు కండకు ఇవ్వాలి. వాపు తగ్గటానికి కార్టిబోన్‌, జోబిడ్‌ వంటి మందులను 15 మిల్లీలీటర్ల మోతాదులో ఇవ్వాలి..