Tuesday 14th of May 2024

ఉత్సవ వీరంగం

14 Dec , 2023 03:23 , IST
Article Image

పల్నాటి రణక్షేత్రం కారెంపూడి కత్తిగట్టి కదంతొక్కిందా.. వీరావేశంతో నాగులేరు ఉవ్వెత్తున ఉప్పొంగిందా.. బ్రహ్మనాయుడి ఉగ్రనృసింహకుంతం సమరనాదం మోగిస్తూ ముందుకురికిందా.. పల్నాటి పౌరుషాగ్నిని రగిలించిందా.. అన్నట్టు పోరాటాల పురిటిగడ్డ పల్నాడు గర్జించింది. వీరారాధనోత్సావాలతో ప్రతి మదీ పులకించింది. వీరుల కొణతములతో వీరంగమాడింది. పల్నాటి వీరారాధన ఉత్సవాలలో భాగంగా బుధవారం రాయబారం ఉత్సవం ఆసక్తికరంగా జరిగింది. తొలుత వీరుల గుడి నుంచి పల్నాటి వీరాచారవంతులు తమ ఆయుధాలతో గ్రామోత్సవానికి బయలుదేరారు. వీరుల గుడిలో కత్తి సేవల అనంతరం చెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ చెన్నకేశవస్వామికి పూజలు చేశారు. ఆలయం బయట కత్తి సేవలు కొనసాగించారు. తర్వాత ఆలయం ముందున్న బ్రహ్మనాయుడు విగ్రహం వద్దకు వీరాచారవంతులు చేరుకుని పూలమాలలు, తులసి మాలలు వేసి ధూపం వేశారు. నమస్కారం చేశారు. అనంతరం అంకాలమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారి చెంతకు ఒక్కొక్కరుగా వెళ్లి దీవెనలు పొందారు. గుడిలో కత్తి సేవలు చేసుకున్నారు. మహిళలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోపాటు మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత కోట బురుజు మీదుగా పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ ఇంటికి తరలి వెళ్లారు. తరుణ్‌ చెన్నకేశవ వీరుల ఆయుధాలకు ధూపం వేశారు. అక్కడ కూడా కత్తి సేవలు కొనసాగాయి. ప్రధాన గ్రామోత్సవంతోపాటు కొందరు వీరాచారవంతులు ప్రత్యేకంగా కొణతములతో వీరంగమాడారు. అంకాలమ్మ, చెన్నకేశవస్వామికి మొక్కులు చెల్లించారు. చిన్న పిల్లలు సైతం కత్తులు చేతబట్టి వీరంగమాడడం గమనార్హం. కొందరు వదిలిన వీరాచారాన్ని మళ్లీ స్వీకరించారు. ఇదిలా ఉంటే రాత్రికి వీర విద్యావంతుడు దర్శి ముక్కంటి వీరుల గుడి ఆవరణలో రాయబారం కథాగానం చేశారు. కోడిపోరులో ఓడిన బ్రహ్మనాయుడు పరివారం అరణ్యవాసం అనంతరం రాజ్య భాగం తిరిగి మలిదేవులకు ఇవ్వాలని కోరుతూ అలరాజు తన మామ నలగామరాజు వద్దకు రాయబారం వెళ్లిన ఘట్టాన్ని చాలా ఆసక్తికరంగా వివరించారు.ఉత్సవాల్లో మూడో రోజు గురువారం మందపోరు ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా అలనాడు బ్రహ్మనాయుడు ఆచరించి చూపిన సమతావాదానికి గుర్తుగా చాపకూడు సిద్ధాంతాన్ని అమలు చేయనున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకరరెడ్డి పాల్గొననున్నారు. బస్టాండ్‌ సెంటర్‌లో కన్నమదాసు మండపం వద్ద కన్నమదాసు సేవా సమితి ఏర్పాటు చేసిన మాచర్ల సర్వ సైన్యాధ్యక్షుడు కన్నమదాసు విగ్రహావిష్కరణ జరగనుంది. .