Monday 13th of May 2024

నాగావళినది తీరంలో స్వామివారికి

14 Dec , 2023 03:39 , IST
Article Image

‘పోలిపాడ్యమి’ సందర్భంగా ‘ఓం నమః శివాయ..హరహర మహదేవ శంభో శంకర’ ‘ఏడు కొండలవాడ వేంకట రమణ..గోవిందా...గోవిందా’ అంటూ భక్తులు చేసిన నినాదాలతో తోటపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం హోరెత్తింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి భక్తులు సమీపంలోని నాగావళినది తీరానికి చేరుకుని, బుధవారం ఉదయం వరకు కార్తీకమాసంలో నెలరోజుల పాటు చేసిన కార్తీకమాస పూజలకు నదీతీరంలో వీడ్కోలు చెబుతూ మార్గశిర శుద్ధ పాడ్యమినాడు మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ తెప్పల్లో దీపాలను పెట్టి నదిలో విడిచిపెట్టారు. అనంతరం స్వామివారికి తిరువీధి నిర్వహించి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస తదితర మండలాలతోపాటు రాజాం, వీరఘట్టం, పార్వతీపురం ప్రాంతాలనుంచి సుమారు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు వీవీ. అప్పలాచార్యులు మాట్లాడుతూ మార్గశిరశుద్ధ పాడ్యమినాడు జీవనదుల్లో స్నానంచేసి స్వామివారిని దర్శించుకుంటే, కోటి సూర్యగ్రహణాల స్నానం ఆచరించిన ఫలితం వస్తుందని పురాణాలలో పేర్కొన్నట్లు చెప్పారు. పాలకొండ డీఎస్పీ అజీజ్‌ పర్యవేక్షణలో చినమేరంగి స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ కళాధర్‌ ఆధ్వర్యంలో భక్తులను క్యూలో ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మర్రాపు సత్యనారాయణ, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాదాలతోపాటు మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..