Saturday 27th of July 2024

భారత్‌ X జర్మనీ

14 Dec , 2023 06:16 , IST
Article Image

జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీలో చక్కని ప్రదర్శన కనబరిచిన భారత్‌కు నేడు జరిగే సెమీ ఫైనల్లో జర్మనీతో క్లిష్టమైన పోరు ఎదురు కానుంది. పటిష్టమైన జర్మనీ అడ్డంకిని దాటితే ఇంచుమించు టైటిల్‌ గెలిచినట్లే! ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో జర్మనీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి . గత టోర్నీ రన్నరప్‌ జర్మనీ ఆరుసార్లు (1982, 85, 89, 93, 2009, 13) టైటిల్‌ గెలిచింది. మరో రెండుసార్లు (1979, 2021) రన్నరప్‌గా నిలిచింది.అంతటి ప్రత్యర్థి ని దాటుకొని భారత్‌ నాలుగో సారి ఫైనల్‌ చేరడం అంత సులువు కాదు. అయితే క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ నెదర్లాండ్స్‌పై ఆడిన తీరు, చేసిన పోరాటం, గెలిచిన వైనం చూస్తే భారత్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేటి జట్టు చేతిలో 0–2తో వెనుకబడిన దశనుంచి భారత్‌ చివరికొచ్చే సరికి 4–3 గోల్స్‌ తేడాతో డచ్‌పై జయభేరి మోగించింది.ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కార్నర్లు లభించినపుడు... గోల్‌ కీపర్‌ మోహిత్‌తో పాటు రక్షణశ్రేణి చూపించిన సయమస్ఫూర్తి, కనబరిచిన పోరాటం అద్వితీయంగా సాగింది. ఇప్పుడు కూడా ఉత్తమ్‌ సింగ్‌ నేతృత్వంలోని భారత్‌ ఇదే ఆటతీరును కొనసాగిస్తే జర్మనీని కట్టడి చేయగలదు. మరో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ తలపడుతుంది. .