Monday 29th of April 2024

'హెల్త్‌కేర్ మ‌హిళ‌లలో క‌నిపించ‌ని రోల్‌మోడ‌ల్‌..' ఫ్రంట్‌లైన్‌కే ప‌రిమితమా?

14 Dec , 2023 06:24 , IST
Article Image

'హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్‌ పాత్రలలోనే కనిపిస్తున్నారు అని దస్రా ఆర్గనైజేషన్‌ ఒక డేటా విడుదల చేసింది.మహిళలు వైద్యవిద్యలలో 29 శాతం ఉంటే, నర్సింగ్‌ సిబ్బందిలో 80 శాతం ఉన్నారు.ఇక 100 శాతం ఆశావర్కర్లుగా ఉన్నారు.ఆరోగ్య సంరక్షణలో నాయకత్వ స్థానాల్లో కేవలం 18 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ రంగంలో పురుషుల కంటే 34 శాతం స్త్రీలు తక్కువ సంపాదిస్తున్నారు.'లాభాపేక్ష లేకుండా, అన్ని రంగాలలో సామాజిక మార్పునకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ దస్రా. ఈ సంస్థ హెల్త్‌ కేర్‌ రంగంపై దృష్టి పెట్టి, ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో పొందుపర్చిన విషయాలలో ముఖ్యంగా గమనించాల్సింది మహిళలకు రోల్‌మోడల్స్‌ లేకపోవడం, వారి పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం గురించి సరైన అవగాహన లేకపోవడం అని పేర్కొంది. భారతదేశంలో ప్రధానమైన హెల్త్‌కేర్‌ రంగం కొన్ని సంవత్సరాలుగా సాంకేతికత, నైపుణ్యాలు, విద్య, వృత్తిపరంగా గణనీయమైన అభివృద్ధి, విస్తరణను చవిచూసింది. అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణ రంగంలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్‌ పాత్రలలో కనిపిస్తున్నారని దస్రా నివేదిక సూచిస్తుంది. దస్రా డైరెక్టర్‌ శైలజా మెహతా మాట్లాడుతూ ‘ఆరోగ్య సంరక్షణరంగంలో మహిళల నాయకత్వంలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. ఎందుకంటే, ఇతర రంగాలను కూడా హెల్త్‌కేర్‌ ప్రభావితం చేయడమే కారణం. లింగ సమానత్వం విషయంలో మా పనిలో మేం మహిళల పురోగతికి సంబంధించిన గ్యాప్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం’ అని తెలిపారు..