Sunday 28th of April 2024

కృత్రిమ దీవిలో వివాదాస్పద భవంతి

14 Dec , 2023 07:07 , IST
Article Image

పోలండ్‌లోని నోటెకా అభయారణ్యంలో ఈ భవంతి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. నదిలో కృత్రిమ దీవిని ఏర్పాటు చేసుకుని, దానిపై మధ్యయుగాల శైలిలో దాదాపు ఎనిమిదేళ్లుగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించిన వివరాలు ఇప్పటికీ పూర్తిగా ఎవరికీ తెలియవు. ఎవరు ఎందుకు ఈ భవంతిని నిర్మిస్తున్నారనే దానిపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ భవంతి నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు.దీని నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇది 2025 నాటికి పూర్తి కాగలదని అంచనా. అభయారణ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవంతి గురించి జనాలకు కొంత ఆలస్యంగా తెలిసింది. దీనిపై స్థానిక పర్యావరణవేత్తలు గగ్గోలు చేయడంతో 2020లో ఏడుగురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణం సాగుతున్నా, దీనిపై పట్టించుకోనందుకు స్థానిక గవర్నర్‌కు పదవి ఊడింది.అయినా, ఈ భవంతి నిర్మాణం వెనుక ఎవరు ఉన్నారనేది మాత్రం స్పష్టంగా బయటపడలేదు. ఈ పరిణామాల తర్వాత కూడా ఈ భవంతి నిర్మాణం యథా ప్రకారం కొనసాగుతూనే ఉంది. ఈ భవంతి నిర్మాణానికి దాదాపు 75 మిలియన్‌ పౌండ్లు (రూ.78.94 కోట్లు) ఖర్చవుతుందని ఒక అంచనా. ఈ భవంతి నిర్మాణం వెనుక జాన్‌ కుల్సిక్‌ అనే పోలిష్‌ కోటీశ్వరుడు ఉన్నట్లు ఒక వదంతి ప్రచారంలో ఉంది..