Monday 29th of April 2024

స్మార్ట్‌ సీతాకోక చిలుకలు

14 Dec , 2023 07:09 , IST
Article Image

రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్న దృశ్యం పిల్లలకే కాదు, పెద్దలకూ సంబరంగానే ఉంటుంది. అలాగని సీతాకోక చిలుకలు ఎప్పుడంటే అప్పుడు కనిపించవు. కాంక్రీట్‌ కీకారణ్యాల్లాంటి నగరాల్లోనైతే, సీతాకోక చిలుకలు కనిపించడం మరీ అరుదు. మరి పిల్లలకు సీతాకోక చిలుకల సరదా తీరేదెలా? అందుకే, అమెరికన్‌ టాయ్‌ కంపెనీ ‘జింగ్‌’ ఎప్పుడంటే అప్పుడు ఎగరవేయగలిగే సీతాకోక చిలుకలను ‘గో గో బర్డ్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది.రంగు రంగులతో అచ్చం అసలు సిసలు సీతాకోక చిలుకల్లా కనిపించే ఈ బొమ్మ సీతాకోక చిలుకలను రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో కోరుకున్నప్పుడల్లా ఇంచక్కా ఎగరేయవచ్చు. డ్రోన్‌ మాదిరిగా ఎగిరే ఈ సీతాకోక చిలుకలను రాత్రిపూట చీకటిపడిన తర్వాత కూడా ఎగురవేయవచ్చు. వీటిలోని ఎల్‌ఈడీ లైట్లు రంగు రంగుల్లో వెలుగుతూ చీకట్లో మిరుమిట్లు గొలుపుతాయి. ఇవి రీచార్జబుల్‌ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ ‘గో గో బర్డ్‌’ సీతాకోక చిలుక ధర 12.99 డాలర్లు (రూ. 1,083) మాత్రమే! గిటార్‌లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌గా తయారు చేసిన చైనీస్‌ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్‌’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దడం విశేషం..