Tuesday 14th of May 2024

అప్పట్లో బాలల దినోత్సవం అంటే అలా ఉండేది..ఆరోజులే వేరు

15 Dec , 2023 11:30 , IST
Article Image

అప్పట్లో పండగలంటే పంద్రా ఆగస్ట్, అక్టోబర్ రెండు, జనవరి ఇరవయ్యారు ఇదిగో నవంబర్ పద్నాలుగు అనే బాలల దినోత్వవమేగా ! అదిగదిగో, తెల్లవారుఝాము నుంచే మొదలయ్యేది హాడావిడి. ఇంట్లో వాళ్ళు పొయ్యి మీద డేగిశా నీళ్ళు అలా పెట్టి ఇలా తరిమేవారు చాకలాయన దగ్గరికి. అప్పటికీ అక్కడికీ చేరిన ఇరుగూ పొరుగూ అని అన్ని రకాల బడి పిల్లలు ఒకరికొకరు బద్ద శత్రువుల్లా కనపడేవారు ఆ కాసింత కాలం. ఎవరికి వారు ముందుగా తమ తమ యూనిఫాంలు ఇస్త్రీ రుద్దించుకోవాలి మరి."కొండలా కూచుంది ఎంతకీ తరగనంది ఏందిరో వింత గొడవా అనే పాట అప్పుడు తెలీకపోయినా పాడుకునే ఉంటాము ఇస్త్రీ చెయ్యవలసిన ఆ బట్టల కొండనీ చూసి ఆ జాతీయ పండగలకు దగ్గర్లో ఏ శుభకార్యం వచ్చినా, పిల్లల పుట్టిన రోజు వచ్చినా పనిలో పని అని , కలిసి వస్తాయి స్కూల్ డ్రెస్సు లే కుట్టించేవారు ఇంట్లో పెద్దలు. స్కూల్ డ్రస్సే కదాని చిన్న చూపేమీ లేదు మాకు, కొత్త తెల్ల అంగి, బ్లూ నిక్కర్ డ్రస్ వేసుకుని బడికి వెల్లడం ఎంత దర్జా ఒలకబోసే పని.చాచా నెహ్రూ పుట్టిన రోజు ఎప్పుడో తెలీదు, బాలల దినోత్సవం అంటే మాత్రం ప్రతి బాలబాలికల యొక్క రెండో పుట్టిన రోజని మాత్రం ఖచ్చితంగా తెలుసు.బిలబిల్లాడుతూ దారివెంట గలగలల కబుర్లు నడిచేవి. పుయ్యిమని మా PET సుందరం సార్ విజిల్ మోతతో కబుర్లన్నీ అఠెన్షన్ మూసి పెట్టి కాలికి కాలు, చేతుకి చేతులు దగ్గరగా చేర్చి విధ్యార్థులు వరుసలు కట్టిన మా బాలల జాతికి మా హెడ్మాస్టర్ హనీఫ్ గారు ఒక సందేశాన్ని ఇచ్చేవారు, విద్యార్థి వరుసల మధ్యలో క్లాస్ లీడర్లు, కండపుష్టి, దబాయింపు తెలిసిన కుర్రాళ్ళు వచ్చి మా అరచేతుల్లో పంచి పెట్టే నెయ్యి చాక్లెట్ తిని మళ్ళీ హానీఫ్ గారి ప్రసంగానికి అంకితం అయ్యేవాళ్ళం. బాగా చదివే పిల్లలకు, బాగా పరిగెత్తే పిల్లలకు, ఖోఖో,కబాడి ఇత్యాది మల్లయుద్దాలు ఆడే పిల్లలకు, క్రమం తప్పకుండా బడికి హజరయ్యే వాళ్ళకు బహుమతులు ఇచ్చేవారు.స్టేజీ మీద పాటలు పాడి కొంతమంది రంజింపజేసేవారు, ఇంకొంతమంది అయ్యామే డిస్కో డాన్సర్ ’ అనీనూ, ’ఒలమ్మీ తిక్క రేగిందా ’ అని కూడాను స్టెప్పులు వేసేవారు. వారికి బహుమతులతో పాటు చొక్కాలకు రూపాయి నోట్లు పిన్నీసు పెట్టి తగిలించేవారు. విజిళ్ళు వేసీ , చప్పట్లు చరిచి ఎంకరేజింగ్ కూడానూ. పదేళ్ల పాటు సాగిన నా బడి బ్రతుకులో నాకు కాసింత అబ్బిన చిత్రకళకు చోటు ఎప్పుడూ దొరకలేదు,ఏనాడు స్టేజి ఎక్కి ఇదిగో బొమ్మకు ఈ బహుమతి అని అందుకున్నది లేదు. అది ఈ రోజుకూ లేదనుకో. అయినా బొమ్మలు వేసినందుకు బడిలో తన్నకపోవడమే మహద్భాగ్యం. ఇంకా పురస్కారాలు కూడానా? ఆశకు అంతుందా ఎక్కడయినా ?పిల్లల పండగ వస్తుందనగానే పిల్లలందరం కలిసి తలా ఇంతా ఇంతా చిల్లర డబ్బులు వేసుకుని క్లాసు రూములకు సున్నాలు కొట్టి, ఝండాలు కట్టి, నల్ల బల్లలకు బుడమాకు-బొగ్గు కలిపిన సింగారం చేసి, తరగతి గది ముందు కళ్ళాపి చల్లి, రంగురంగుల ముగ్గులు చిత్రించి అవి చూసుకోవడానికి ఇంతింత కళ్ళయ్యేవాళ్లం. బడి లోపలి గోడల మీద నేను వేసిన చాచా నెహ్రూ కోటు మీది గులాబి పువ్వుని అందుకుని అమ్మాయిలు జడల్లొ తురుముకునేవారు. అదీ ఒక పురస్కారం వలెనే అని అప్పుడు తెలీదు..