Tuesday 14th of May 2024

పుట్టపర్తిలో దారుణం.. అనుమానంతో భర్త!

15 Dec , 2023 12:02 , IST
Article Image

ఐదేళ్ల కిత్రం పెళ్లి అయినా పట్టుమని పది నెలలు కూడా ఆ జంట సజావుగా కాపురం చేసింది లేదు. అనుమానం పెనుభూతంగా మారడంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే కట్టుకున్న భార్యను కడతేర్చేందుకు యత్నించాడు భర్త. పుట్టపర్తి రూరల్‌ ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాలమేరకు.... నల్లమాడ మండలం కురుమాల గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమార్తె వి.అనితను అతని అక్క కుమారుడు (వరుసకు మేనమామ) అయిన గోరంట్ల మండలం కొలిమిపల్లికి చెందిన శివమ్మ, శంకరప్ప దంపతుల కుమారుడు రామాంజనేయులుకు ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి జరిపించారు.కొంత కాలం సజావుగా సాగిన వీరి సంసారంలో అనుమానం పెనుభూతంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తరచూ గొడవ పడేవారు. ఇందులో భాగంగానే గొడవ జరిగిన ప్రతిసారి అనిత పుట్టింటికి వెళ్లిపోయేది. పెద్దలు పంచాయితీ చేసి మళ్లీ భర్త దగ్గరకు పంపేవారు. ఇదే క్రమంలో 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన అనిత పెద్దల ఒప్పందం మేరకు అత్తగారింటికి వచ్చింది.అయితే మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో గురువారం ఉదయం తిరిగి పుట్టింటికి వెళ్లేందుకు అనిత సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రామాంజినేయులే భర్య అనితను పుట్టింటికి దిగబెడతానని నమ్మించాడు. కురుమాలకు వెళ్దామని చెప్పి ద్విచక్ర వాహనాన్ని అడవి గుండా తీసుకెళ్లాడు. పుట్టపర్తి మండలం దిగువచెర్లోపల్లి గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి రాగానే రోడ్డు పక్కకు ద్విచక్ర వాహనాన్ని నిలిపి అనితను చెట్ల చాటుకు లాక్కెళ్లి కత్తితో గొంతు కోశాడు. పెనుగులాటలో చేతులను కూడా గాయపరిచాడు.ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న కొందరు గమనించి కేకలు వేయగానే రామాంజినేయులు బైక్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న అనితను అటువైపుగా వచ్చిన ఓ కారులో గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని, కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతామని రూరల్‌ ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు..