Monday 29th of April 2024

చాట్‌ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో...!

15 Dec , 2023 12:34 , IST
Article Image

చాట్‌జీపీటీ.. ఆన్‌లైన్‌ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించిన తాజా సంచలనం. మెయిళ్లు రాయడం మొదలుకొని కథలల్లడం వరకూ ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టేయగలదీ కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ.  అయితే జీపీటీ 4ను వాడటం పూర్తిగా ఉచితం కాదు. కొంతవరకూ ఫ్రీగా వాడుకోవచ్చు కానీ.. ఆ తరువాత మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి సమాచారం ఉచితంగా పొందాలంటే? ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి.  గూగుల్‌కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్‌ బింగ్‌నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది. దీని వెబ్‌సైట్‌లోకి వెళ్లి బింగ్‌ చాట్‌తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్‌ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బింగ్‌లోని రైటింగ్‌ అసిస్టెంట్‌ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణం సాఫీగా సాగటానికి ప్లాన్‌ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావొచ్చు. ఇక ఇమేజ్‌ జనరేటర్‌ ద్వారా ప్రాంప్ట్‌ను అందించి ఉచితంగా బొమ్మలను గీయించుకోవచ్చు. దీనిలోని ట్రాన్స్‌లేటర్‌ బోలెడన్ని భాషలను ఇట్టే అనువదిస్తుంది. ఇక ఏఐ ఆధారిత కోపైలట్‌ క్రెడబులిటీ ఉన్న సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సహాయంతో మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కచ్చితమైన సమాచారాన్ని ముందుంచుతుంది. మన ప్రాధాన్యాలు, గతంలో జరిపిన చర్చలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా స్పందిస్తుంది.  మెర్లిన్‌: ఇదో క్రోమ్‌ చాట్‌జీపీటీ ఎక్స్‌టెన్షన్‌. ఏ వెబ్‌సైట్‌ మీదైనా యాక్సెస్‌ చేయొచ్చు. మెర్లిన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని, ఖాతాను ఓపెన్‌ చేస్తే చాలు. కంట్రోల్‌/ కమాండ్‌ ప్రాంప్ట్‌ రూపంలో ఆదేశాలు ఇస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చిటికెలో బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్‌సైట్ల సారాంశాన్ని ముందుంచుతుంది. సోషల్‌ మీడియా కంటెంట్‌నూ సృష్టించుకోవచ్చు. ఈమెయిళ్లు, కోడ్స్‌ రాసి పెడుతుంది. దీనిలోని చాట్‌జీపీటీ ప్లగిన్లు ఉత్పాదకత పెంచటానికి ఎంతగానో తోడ్పడతాయి. మెర్లిన్‌లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సైడ్‌బార్‌లో సమాధానాలిస్తుంది.  పోయ్‌: ఇది కోరాకు చెందిన ఏఐ యాప్‌. ఆంత్రోపోనిక్‌ సంస్థ రూపొందించిన క్లౌడ్‌ దగ్గరి నుంచి ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రశ్నలను సంధించి జవాబులు రాబట్టుకోవచ్చు. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీ దీని సొంతం. అంతరాయాలులేని సంభాషణ, సృజనాత్మక కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పోయ్‌ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్‌ యూజర్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా బాట్‌ లేదా ప్రాంప్ట్‌తో తేలికగా వాడుకోవచ్చు..