Sunday 28th of April 2024

యాపిల్‌కి గట్టి దెబ్బ.. తప్పుకొంటున్న చీఫ్‌ డిజైనర్‌

15 Dec , 2023 12:37 , IST
Article Image

ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్‌ ఉండే ప్రీమియం ఫోన్లు, వాచీల తయారీ సంస్థ యాపిల్‌కి గట్టి దెబ్బ తగిలింది. ఐఫోన్‌లు, యాపిల్ వాచీల డిజైన్‌ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైదొలుగుతున్నారు.  కీలకమైన టాన్‌ నిష్క్రమణతో కంపెనీ డిజైన్ బృందానికి గట్టి దెబ్బ తగిలిందని యాపిల్‌ వర్గాలు బ్లూమ్‌బెర్గ్‌కి వెల్లడించాయి. యాపిల్‌కు చెందిన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈయనే. యాపిల్‌ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ వంటి ఇతర ఉత్పత్తుల రూపకల్పనలో టాన్‌ ప్రభావం ఎ‍క్కువగా ఉంది. యాపిల్‌ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక.. అన్నీ టాన్‌ బృందం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్‌ పాడ్స్‌, యాపిల్‌ వాచీలను కంపెనీకి లాభదాయక ఉత్పత్తులుగా మార్చడంలో టాన్‌ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు టాన్ నిష్క్రమణతో కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి శ్రేణులలో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈయన నేరుగా హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జాన్ టెర్నస్ కింద పనిచేశారు.  కంపెనీకి చెందిన ఇతర మ్యాక్‌ ప్రొడక్ట్ డిజైన్, ఐఫోన్ హార్డ్‌వేర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవల పదోన్నతి పొందిన నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో యాపిల్ మరిన్ని నాయకత్వ మార్పులకు సిద్ధమవుతుందని నివేదిక సూచిస్తోంది. కాగా టాన్ నిష్క్రమణ కంపెనీలో కీలక కార్యనిర్వాహక నిష్క్రమణల్లో రెండోది. ఐఫోన్ మల్టీటచ్ స్క్రీన్, టచ్ ఐడీ, ఫేస్ ఐడి వంటి కీలక సాంకేతికతలపై పనిచేసిన స్టీవ్ హోటల్లింగ్ యాపిల్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి..