Monday 29th of April 2024

మార్పులే మంత్రం!

15 Dec , 2023 12:39 , IST
Article Image

రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు కానీ, కొన్ని ఘటనలు అమితాశ్చర్యానికి గురి చేస్తాయి. ఆకర్షిస్తాయి. అవి సంభవించడానికి ప్రేరణ ఏమిటన్న ఆలోచనకు పురిగొల్పుతాయి. ఇటీ వలి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ కొత్త ముఖ్యమంత్రుల ఎంపిక అక్షరాలా అలాంటిదే. మూడు చోట్లా సీనియర్లను కాదని కొత్త ముఖాలను కాషాయ పార్టీ ఎంచుకున్న తీరు ఆశ్చర్యాన్నీ, ఆలోచననూ కలిగిస్తోంది.కొత్త నేతల పేర్లు పెద్దగా తెలియ కున్నా... రకరకాల స్థానిక సామాజిక వర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకొన్నాకనే మధ్యప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్‌ సహాయ్, రాజస్థాన్‌లో భజన్‌లాల్‌ శర్మలను అధిష్ఠానం ఎంపిక చేసినట్టుంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు రానున్న వేళ కమలనాథులు అనుసరిస్తున్న ఈ కొత్త సీఎం ముఖాల వ్యూహం లోతుపాతుల పట్ల అంచనాలు, విశ్లేషణలను పెంచుతోంది.ప్రజాస్వామ్యంలో సభలో సంఖ్యా బలంతో అధికార పీఠంపై కూర్చొనే రాజకీయ పార్టీకీ, ఎన్నికైన ఆ పార్టీ చట్టసభ సభ్యులకూ తమకు నచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొనే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటాయి. అది ఆ పార్టీల అంతర్గత వ్యవహారం. అయితే, శ్రమించి పార్టీని అధికారంలోకి తెచ్చిన, నిలబెట్టిన సీనియర్‌ నేతలకు సీఎం పీఠం దక్కకపోవడం, రాజస్థాన్‌ లాంటి చోట్ల తొలిసారి ఎమ్మెల్యేనే సరాసరి సీఎంను చేయడం, మంత్రులుగా ఎన్నడూ పనిచేయనివారిని డిప్యూటీ సీఎంలను చేయడం విచిత్రమే.కానీ నిత్యం ఎన్నికల పోరులో ఉన్నట్టే ఏడాది పొడుగూతా శ్రమించే బీజేపీకి తనవైన లెక్కలున్నాయి. విస్తృత రాజకీయ, సైద్ధాంతిక వ్యూహమూ ఈ ఎంపికలో కనిపి స్తోంది. ప్రతి రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమతూకం పాటిస్తూ, సామాజిక వర్గాల బలాబలాలను అంచనా వేసుకొంటూ ఈ కొత్త సీఎంల ఎంపికకు వ్యూహరచన చేశారని అర్థమవుతోంది. కొత్త సీఎంలు ముగ్గురూ హిందూత్వ వాదులే. ఆరెస్సెస్‌కు సన్నిహితులే. అధినేతలకు విధేయులే. .